23 May, 2026 | 9:29 PM

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

23-05-2026 08:35 PM

* ప్రభుత్వాన్ని బద్నాం చేసేలో విపక్షాల కుట్రలు 

* టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి

అచ్చంపేట: రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలు లేనిపోని అపోహలు కల్పిస్తున్నారని టిపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్,  నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి ద్వజమెత్తారు. 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా శనివారం పదర మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – అన్నదాతల అవగాహన సదస్సు” ముగింపు కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణతో కలిసి పాల్గొన్నారు.

అనంతరం అచ్చంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మొక్కజొన్న కొనుగోళ్లపై కనీస అవగాహన లేకుండా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ బురద జల్లుతున్నాయని  మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న చిన్న సమస్యలను అధిగమించి, ప్రభుత్వం మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోళ్లను అత్యంత వేగవంతం చేసిందని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు రాబోయే వానాకాలం సాగుకు ముందే సమాయత్తం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే శాస్త్రీయ విధానాలపై అవగాహన కల్పించేందుకే వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలను నేరుగా రైతుల వద్దకు తీసుకువచ్చామని తెలిపారు. శాస్త్రవేత్తలు, జిల్లా అధికారులు, రైతులు పాల్గొన్నారు.