13-02-2026 06:49:46 PM
మున్సిపల్ ఎన్నికల్లో బ్రహ్మరథం
హైదరాబాద్: తెలంగాణ ఓటర్లకు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్(TPCC Mahesh Kumar Goud) వందనాలు, అభినందనలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై నిజామాబాదులో మహేష్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాపాలనకు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. 90కి పైగా మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు గెలిచినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. సంక్షేమం, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు పథకంతో మున్సిపల్ ఎన్నికల్లో తమకు పట్టం కట్టారని చెప్పారు.
దాదాపు 65 నుంచి 70 శాతం మున్సిపాలిటీలు గెలిచినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థుల కుయుక్తులు పనిచేయలేదని స్పష్టం చేశారు. మెజారిటీ వార్డులు కాంగ్రెస్ గెలుచుకుందన్నారు. ప్రతిపక్షాలు అన్ని కలిసినా 25 శాతం ఓట్లు కూడా గెలవలేదన్నారు. తమ ప్రత్యర్థులు నిజామాబాద్, కరీంనగర్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసిన అది ఫలించలేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని కొనియాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100కి పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మెగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 75 నుంచి 80 శాతం డివిజన్లు గెలుస్తామని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.