4 June, 2026 | 1:36 AM

ఢిల్లీలో విషాదం

04-06-2026 12:00 AM
  1. రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం 21మంది సజీవదహం
  2. హోటల్ యజమానిపై కేసు నమోదు

న్యూఢిల్లీ, జూన్ 3 (విజయక్రాంతి): అంతులేని నిర్లక్ష్యం, నిబంధనలకు నీళ్లొదిన అధికారులు, పర్యవేక్షణ లోపం వెరసి అమాయక ప్రజల ప్రాణాలు మంటల్లో కలిశాయి. ఢిల్లీలో బుధవారం ఉదయం ఓ హోట్‌లో చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది అగ్నికి ఆహుతి అయ్యారు.  మరో 40 మందికి గాయాలు కాగా.. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 18 మంది వైద్యం కోసం వచ్చిన విదేశీయులు ఉండటం మరో విషాదం. క్షతగాత్రులకు ఎయిమ్స్,  మాక్స్, పండిట్ ఎం.ఎం. మాల్వియా ఆస్పత్రుల్లో చికిత్స అందజేస్తున్నారు.

ఢిల్లీ పోలీసుల వివరాల ప్రకారం.. మాల్వియానగర్ హౌజ్ రాణి ప్రాంతంలోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్ .. ఫ్లోరిష్ స్టే, బేస్‌మెంట్‌లోని కొన్ని గదులతో సహా 25 గదులను నిర్వహిస్తోంది. ఐదంతస్తులున్న ఈ భవనంలోని బేస్మెంట్ గదుల్లో బుధవారం ఉదయం 8.50 గంటల ప్రాంతంలో పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లోనే.. దట్టమైన పొగ,మంటలు భవనాన్ని చుట్టుముట్టాయి. స్థానికులు గమనించి వెంటనే నేలపై పరుపులు పరవడంతో కొందరు వాటిపై దూకి ప్రాణాలతో బయటపడ్డారు.

మరికొందరు లోపల చిక్కుకుపోయారు. అత్యవసర సేవల సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించి, 40 మందికి పైగా ప్రజలను రక్షించారు. బేస్మెంట్‌లో చిక్కుకుపోయిన వారు తప్పించుకునే దారి లేక చాలామంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. హోటల్, రెస్టారెంట్ యాజమాని లోకేష్ బజాజ్ కుటుంబంతో సహా పరారీలో ఉన్నాడు. మరో ఇద్దరు పార్ట్‌నర్లు కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసులు లోకేష్ బజాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

ప్రముఖుల విచారం

మాల్వియానగర్ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర ద్రిగ్భాంతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అగ్నిప్రమాద ఘటన తనను కలచివేసిందని, బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు.   

పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ కింద మృతులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50వేల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహు ల్‌గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఎం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.  

అనుమతి 6 గదులకు, నిర్వహిస్తున్నది 25 గదులు  

లెమన్ గ్రీన్ రెస్టారెంట్ అనుమతులకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హోటల్‌కు బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ కాన్సెప్ట్ కింద లైసెన్స్ ఇచ్చింది. దీని ప్రకారం కేవలం ఆరు గదులను మాత్రమే నడపాల్సి ఉండగా, యాజమాన్యం 25 గదులను నిర్వహిస్తోంది. బేస్మెంట్లో గదులను నిర్మించడం, భద్రతా ప్రమాణాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. అనుమతులిచ్చి చేతులు దులుపుకున్న అధికారులు ఒక్కసారి కూడా ఈ హోటల్ వైపు కన్నెత్తి చూడలేదు.

పైగా స్థానిక పరిపాలన, సంబంధిత శాఖల నుంచి అనుమతి పొందలేదని సమాచారం. ఈ భవనానికి ఫైర్ ఎన్‌వోసీ కూడా లేదని అగ్నిమాపకశాఖాధికారులు స్పష్టం చేశారు. బేస్మెంట్‌లో నిర్వహిస్తున్న హోటల్ ప్రధాన గేటు ఎలక్ట్రానిక్ కావడం వల్ల ప్రమాద సమయంలో ఆటోమెటిక్‌గా తాళం పడిపోయింది. బాధితులు తప్పించుకుందామని ప్రయత్నించినా తాళం తెరుచుకోలేదు. దీంతో చాలామంది అగ్నికి ఆహుతయ్యారు. క్షతగాత్రుల్లో 15 మంది ఐసీయూలో ఉన్నారని, వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పొగవల్ల ఊపిరాడక ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్లు పేర్కొన్నారు.     

మృతుల్లో 18 మంది విదేశీయులు

అగ్నిప్రమాదంలో 18 మంది విదేశీయులు ఉన్నట్లు అధికారులలు నిర్ధారించారు. మృతులు నైజీ రియా, మొజాంబిక్, బంగ్లాదేశ్, సోమాలియా, సైబీరియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందినవారిగా గు ర్తించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పా ల్గొన్న పోలీసు సిబ్బందిలో 10 మంది గాయపడ్డారు.