18-10-2025 05:07:27 PM
సిద్దిపేట రూరల్: రావురూకుల గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన బ్యాగరి మల్లవ్వ అనారోగ్యంతో మృతిచెందారు. గత కొద్ది సంవత్సరాలుగా వరుసగా కుటుంబ సభ్యుల మరణాలతో ఆమె కుటుంబం దారుణ పరిస్థితికి గురైంది. ఇప్పటికే మల్లవ్వ కుమారుడు, కోడలు, భర్త మరణించడం వల్ల కుటుంబంలో ఉన్న ఏకైక ఆధారం అయిన 14 సంవత్సరాల మనవరాలు రమ్య ఇప్పుడు పూర్తిగా అనాధగా మారింది. నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలను కోల్పోవడం ఆమె జీవితాన్ని చీకటిలోకి నెట్టింది. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఆ చిన్నారిని చూసి గ్రామస్థులు కన్నీరు పెట్టుకున్నారు. గ్రామ ప్రజలు రమ్యకు ఆర్థిక, విద్యా సహాయం అందించేందుకు ప్రభుత్వం మరియు దాతలు ముందుకు రావాలని వేడుకున్నారు.