16 July, 2026 | 2:58 PM

ఏటా 68 రైలు ప్రమాదాలు

19-06-2024 12:00 AM
  • 2014-24 మధ్య సగటు యాక్సిడెంట్లు ఇవి
  • 2004-14 మధ్య ఏటా 171 ప్రమాదాలు
  • కవచ్ వ్యవస్థ ఉన్నా ఆగని ఘోరాలు

న్యూఢిల్లీ, జూన్ 18: దేశంలో ఏటా సగటున 68 రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. సోమవారం పశ్చిమబెంగాల్‌లో కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టడంతో 9 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో రైలు ప్రమాదాలపై రైల్వేశాఖ పలు కీలక వివరాలు వెల్లడించింది. 2004-14 మధ్య ఏటా సగటున 171 రోడ్డు ప్రమాదాలు జరిగితే, 2014 నుంచి 24 మధ్య 68కి తగ్గాయని తెలిపింది. భారత రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలో నాలుగో అతిపెద్దది. అమెరికా, రష్యా, చైనా తర్వాత భారతీయ రైల్వేనే పెద్దది. అయితే, మొదటి మూడు దేశాలతో పోల్చితే భారత్‌లో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

మానవ తప్పిదాల తో జరిగే ప్రమాదాలను నివారించేందుకు దేశీయంగా కవచ్ పేరుతో రక్షణ వ్యవస్థను తయారుచేసి అమల్లోకి తెచ్చారు. అయినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సోమవారం బెంగాల్‌లో జరిగిన ప్రమాదం కూడా మానవ తప్పిదమేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కొన్నేండ్లుగా రైల్వేల భద్రతకు పెద్దపీట వేస్తూ బడ్జెట్‌లో నిధులు కూడా పెంచుతున్నారు. అయినా, ప్రమాదాలను నివారించలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రమాదాల డాటాను విడుదల చేస్తూ.. యూపీఏ ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుతం ప్రమాదాలు తగ్గాయని సమర్ధించుకొనేందుకు ప్రయత్నించింది.

కానీ, ప్రయాణీకుల ప్రాణాలకు హామీ ఇవ్వలేదు. నిజానికి అమెరికా, రష్యాలో రైల్వే నెట్‌వర్క్‌లు కిలోమీటర్ల పరంగా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పటికీ.. ప్రయాణీకుల పరంగా మనమే ముందున్నాం. రోజుకు కొన్ని కోట్ల మంది భారతీయ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అమెరికా, రష్యాల్లో రైళ్లను ప్రధానంగా సరుకు రవాణా కోసం వినియోగిస్తున్నారు. అక్కడ ప్రమాదాల నివారణకు అత్యాధునిక సాంకేతికతలను వాడుతున్నారు. ఒకవేళ ప్రమాదం జరిగినా పెద్దగా ప్రాణ నష్టం ఉండదు. చైనాలో గంటకు నాలుగైదు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైళ్లు నడుపుతున్నారు. అంత వేగంతో వెళ్లినా అవి ప్రమాదానికి గురైన దాఖలాలు లేవు. మన రైళ్ల వేగం గంటకు సగటున 40 కిలోమీటర్లే. అయినా నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 

ఇటీవల జరిగిన ప్రధాన రైలు ప్రమాదాలు

  • * ఒడిశాలో 2013, జూన్ 2న షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలును గూడ్స్ రైలు ఢీకొట్టడంతో 290 మంది ప్రయాణీకులు మరణించారు. 900 మంది గాయపడ్డారు. 

* ఆంధ్రప్రదేశ్‌లో 2023, అక్టోబర్ 29న విశాఖపట్నం ప్యాసింజర్ రైలును విశాఖపట్నం  రాయగడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో 14 మంది మరణించారు.

* బీహార్‌లో 2023, అక్టోబర్ 11న ఆనంద్ విహార్ టెర్మినల్ కామాఖ్య జంక్షన్ నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పటంతో నలుగురు మరణించారు. 70 మంది గాయపడ్డారు.

* 2023, ఆగస్టు 25న తమిళనాడులో మధురై జంక్షన్‌లో ఆగి ఉన్న లక్నో-రామేశ్వరం భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగటంతో 9 మంది మరణించారు. 20 మంది గాయపడ్డారు. 

* 2022, జనవరి 13న పశ్చిమబెంగాల్‌లోని అలీపుర్దౌర్ వద్ద బికనేర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పటంతో 9 మంది మరణించారు. 36 మంది గాయపడ్డారు.

* 2017, ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్‌లో కైఫియత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పటంతో 70 మంది గాయపడ్డారు.

* ముజఫర్‌నగర్‌లో 2017, ఆగస్టు 19న పూరీ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పటంతో 20 మంది మరణించారు. 60 మంది గాయపడ్డారు. 

సంవత్సరాలవారీగా రైలు ప్రమాదాలు 

సంవత్సరం       ప్రమాదాల సంఖ్య

2000-01 472

2001-02 415

2002-03 351

2003-04 325

2004-05 234

2005-06 234

2006-07 195

2007-08 194

2008-09 177

2009-10 165

2010-11 141

2011-12 131

2012-13 132

2013-14 118

2014-15 135

2015-16 107

2016-17 104

2017-18 73

2018-19 59

2019-20 55

2020-21 22

2021-22 35

2022-23 48

2023-24 40