16 July, 2026 | 3:24 PM

మహా చదరంగంలో గెలిచేదెవరు?

19-06-2024 12:00 AM

ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు

ముందుగానే రంగంలోకి బీజేపీ

సార్వత్రికంలో చతికిలబడటంతో అప్రమత్తంగా చర్యలు

ఇప్పటికే రాష్ట్రానికి ఇన్‌చార్జీల నియామకం

తిరిగి పుంజుకున్న ఎంవీఏను నిలువరించేందుకు ప్రయత్నాలు

న్యూఢిల్లీ, జూన్ 18: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. దీంతో మిత్రపక్షాలపై ఆధారపడి సం కీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, భవిష్యత్తులో ఇలాంటి ఫలితాలు పునరావృ తం కాకుండా బీజేపీ అధిష్ఠానం ఆదిశగా అడుగులు వేస్తుంది. అందుకే ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పుడే కసరత్తు మొదలుపెట్టింది.

ఆయా రాష్ట్రాలకు ఇన్‌చార్జీలను నియమించింది. ఈ రాష్ట్రాల్లో మహారాష్ట్ర అత్యంత కీలకం కానుంది. రాష్ట్రం లో అధికారంలో ఉన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో ఘోరమైన పనితీరు కనబరిచి భారీగా సీట్లు కోల్పోయింది. 2019లో 25 స్థానాల్లో పోటీ చేసి 23 సీట్లు సాధించగా ఈసారి 28 సెగ్మెంట్లలో పోటీ చేసి కేవలం తొమ్మిదికే పరిమితమైంది. విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ అనూహ్యంగా పుంజుకుని 30 సీట్లు సాధించింది. దీంతో మహా అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ ఇద్దరు మంత్రులను ఇన్‌చార్జీలుగా పంపింది. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, అశ్వినీవైష్ణవ్‌కు బాధ్యతలు అప్పగించింది.

2019 నుంచి ట్విస్టులే ట్విస్టులు

మహారాష్ట్రలో రాజకీయ పరంగా 2019 నుంచి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 సీట్లకు గాను బీజేపీ 105 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 56 సీట్లు, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి బరిలో నిలిచాయి. అయితే ఫలితాల అనంతర అనేక ట్విస్టులు చోటుచేసుకున్నాయి. అప్పటి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సీఎం సీటు కావాలని డిమాండ్ చేయగా బీజేపీ అస్సలు ఒప్పుకోలేదు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. కొన్నాళ్లకు బీజేపీ ఎన్సీపీ నేత అజిత్ పవార్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దేవేంద్ర ఫడణవీస్ సీఎంగా, అజిత్‌పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. అయితే అజిత్ వర్గంలో ఎమ్మెల్యే మద్దతు తెలపకపోవడంతో 5 రోజులకే ఈ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత పరిస్థితిని గమనించి పావులు కదిపిన ఎన్సీపీ అధినేత శరద్‌పవార్.. కాంగ్రెస్, శివసేనతో కలిసి మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిని ఏర్పాటు చేశారు. ఉద్ధవ్ సీఎం అయ్యారు. 

శివసేన, ఎన్సీపీల్లో కుదుపు

రెండున్నర ఏళ్ల తర్వాత ఎంవీఏ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. రాజకీయ విభేదా లతో శివసేన రెండుగా చీలిపోయింది. ఏకనాథ్ షిండే నేతృత్వంలో 30 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. అసలైన శివసేన తమదేనని గవర్నర్‌కు లేఖ రాశారు. ఉద్ధవ్‌కు మద్దతును ఉపసంహరించుకున్నా రు. దీంతో కొన్ని పరిణామాల తర్వాత ఎంవీ ఏ ప్రభుత్వం కూలిపోయింది. షిండే ముఖ్యమంత్రిగా ఎన్డీయే మహారాష్ట్ర పీఠాన్ని అధిష్ఠించింది. ఆ తర్వాత ఇవే పరిణామాలు ఎన్సీపీలోనూ జరిగాయి. అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ ఎమ్మెల్యేలు అధికార కూటమి లో చేరారు. షిండే, పవార్ చేతుల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటంతో శివసేన, ఎన్సీపీ వీళ్లకే దక్కాయి. ఉద్ధవ్, శరద్‌పవార్ కొత్త పార్టీలు పెట్టుకోవాల్సి వచ్చింది. 

సానుభూతితో పుంజుకున్న ఎంవీఏ

మహారాష్ట్రలో ఈ పరిణామాలన్ని రాజకీయ చదరంగాన్ని తలపించాయి. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు మళ్లీ ఎలాంటి సంక్షోభం ఏర్పడలేదు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎన్డీయే కూటమికి భారీ దెబ్బ తగిలింది. భారీగా సీట్లను కోల్పోయింది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నా గతంలో జరిగిన రాజకీయ పరిణామాలతో ఎంవీఏకు సానుభూతి లభించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉల్లి రైతుల వ్యతిరేకత కూడా బీజేపీకి అడ్డంకిగా మారింది. మరోవైపు శరద్ పవార్ ప్రాంతీయ, సామాజిక సమీకరణాలతో అభ్యర్థులను ఎంపిక చేయడమూ ఎంవీఏకు కలిసి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో అదే వ్యూ హంతో రానున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్రంపై పట్టు కోల్పోకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యమని భావిస్తోంది. పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్రలో అధికారానికి దూరం కావద్దని పట్టుదలతో ఉంది. 

షిండే, అజిత్ పరిస్థితి ఏంటి?

లోక్‌సభ ఎన్నికల్లో షిండే, అజిత్‌పవార్ నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ పేలవ ప్రదర్శన చేశాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు ఎలా ఉంటాయనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ ఆ పార్టీలకు తగిన ప్రాధాన్యం ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. మహారాష్ట్ర ప్రాంతీయ సమస్యలు కూడా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

అందుకే మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. మరోవైపు చివరి అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎంవీఏలోకి అధికార కూటమి నుంచి భారీగా వలసలు ఉంటాయని ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో హార్స్ ట్రేడింగ్ చేసిన బీజేపీ పట్టు కోల్పోయిందని, వెన్ను పోటు పొడిచిన ఎన్సీపీ, శివసేన చతికిలపడ్డాయని చెబుతున్నారు. ఎంవీఏకే ప్రజలు మద్దతు ఇస్తున్నారని, అందువల్ల అధికార కూటమి నేతలు తమకు టచ్‌లోకి వస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ సెషన్స్ తర్వాత మహారాష్ట్రలో ఏం జరగబోతోందన్నది సస్పెన్స్‌గా మారింది.