calender_icon.png 6 August, 2025 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టంలేకే రైలుయాత్రలు

05-08-2025 12:19:34 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు 

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): బీసీలకు రిజర్వేషన్లు పెంచడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, అందుకే రైలుయాత్రల పేరుతో మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సర్కారు రిజర్వేషన్ల విషయంలో బీసీలను తీవ్రంగా మోసగిస్తుందంటూ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వాపోయారు. బీసీలకు మాత్రమే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటే తాము పూర్తి మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు ముస్లింలకు 10 శాతం వాటా ఇస్తామని చెప్పలేదన్నారు. కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే బీసీలకే మొత్తం 42 శాతం అమలు చేయాలన్నారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోందంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ను బీసీలు ముమ్మాటికీ నమ్మబోరని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఉద్ధేశం ఏమాత్రం లేదని, ఒకవేళ జరిపినా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామన్న మాట ఉత్తదేనన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాపై రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.