ట్రైన్ ది ట్రైనర్స్.. రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ కార్యశాల విజయవంతం
ప్రొఫెసర్ హుస్సేన్
మెదక్, ఏప్రిల్ 1(విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆటానమస్), మెదక్లో భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ట్రైన్ ది ట్రైనర్స్: రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ అంశంపై ఒకరోజు కార్యశాల విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక యుగంలో రోబోటిక్స్ ప్రాధాన్యత రోజురోజుకూ విస్తరిస్తోందని పేర్కొన్నారు.
వైద్య రంగంలో రోబోటిక్ శస్త్రచికిత్సలు, పరిశ్రమల ఆటోమేషన్, వ్యవసాయ రంగంలో స్మార్ట్ సాంకేతికతలు, అంతరిక్ష పరిశోధన వంటి అనేక రంగాల్లో రోబోటిక్స్ కీలక పాత్ర పోషిస్తున్నదని వివరించారు. ఈ రంగంలో నైపుణ్యాలను సాధించిన విద్యార్థులకు భవిష్యత్తులో విస్తృత అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యశాల సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్, హైదరాబాద్ వారి సహకారంతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అకాడమీ ప్రతినిధులు కుమారి ప్రహర్షారెడ్డి, పవన్ కుమార్, నవీన్ కుమార్ పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ, కళాశాల భౌతిక శాస్త్ర విభాగానికి సుమారు ఒక లక్ష రూపాయల విలువైన రోబోటిక్ కిట్లను అందజేసి రోబోటిక్స్ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రయోగశాల ద్వారా విద్యార్థులు ప్రాజెక్టులు రూపొందించుకోవడంతో పాటు రోబోటిక్స్ ప్రదర్శనలు, పోటీలలో పాల్గొనే అవకాశాలు పొందుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఆర్. శ్రీలత, డాక్టర్ సి. సుధారాణి, డాక్టర్ బి. నిదర్శిని, నవీన్ కుమార్, నరేష్ గౌడ్, స్వాతి, డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే భౌతిక శాస్త్ర విభాగం ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




