7 August, 2026 | 4:03 PM

విద్యార్థులకు ముప్పుగా ట్రాన్స్‌ ఫార్మర్

07-08-2026 03:27 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలంలోని జంబుల్‌ధరి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారి విద్యార్థులకు ముప్పుగా నిలుస్తోందని గ్రామ ఉపసర్పంచ్ గుర్నులే విఠల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ చిన్నారులు ట్రాన్స్‌ ఫార్మర్ సమీపంలోనే సంచరిస్తుండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. పాఠశాల ఆవరణలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి జనసంచారం లేని సురక్షిత ప్రదేశంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే కంటే ముందస్తు చర్యలు తీసుకోవడం ఎంతో అవసరమని అన్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో చిన్నారుల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.