9 June, 2026 | 4:23 PM

వైద్య సేవల్లో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ కె.హరిత

09-06-2026 03:49 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత సూచించారు. మంగళవారం  కలెక్టరేట్  నుంచి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి జిల్లాలోని  పిహెచ్సి, సిహెచ్సిల వైద్యాధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

వైద్యులు, హెల్త్ సూపర్వైజర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని, విధుల్లో అలసత్వం సహించబోమని హెచ్చరించారు. సిబ్బంది హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా విధిగా హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు, యాప్ హాజరును ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.

పిహెచ్సిల పరిధిలో గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారికి అవసరమైన మందులు, టీకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులకు వచ్చే రోగులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వ్యాధుల వ్యాప్తి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, ఉప వైద్యాధికారి నాగేందర్, జిల్లాలోని వైద్యాధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.