5 July, 2026 | 12:47 AM

రోబోలు కాదు మనుషులే

24-05-2024 12:37 AM

న్యూఢిల్లీ: అథ్లెట్లను రోబోలుగా కాకుండా మనుషులుగా ట్రీట్ చేస్తే బాగుంటుందని మాజీ షూటర్ అభినవ్ బింద్రా అభిప్రాయపడ్డాడు. ఇటీవలీ కాలంలో ఆసియా గేమ్స్, కామన్‌వెల్త్ లాంటి ఈవెంట్స్‌లో భారత అథ్లెట్లు పతకాలు సాధించడం ద్వారా వారిపై ఒత్తిడి పెరిగిపోయిందని పేర్కొన్నాడు. కేవలం పతకాలు సాధించే రోబోలుగా మాత్రమే చూస్తున్నారని.. ఆ వైఖరి మార్చుకుంటే బాగుంటుందని తెలిపాడు. ఢిల్లీలో కార్యక్రమానికి హాజరైన బింద్రా మాట్లాడు తూ..‘అథ్లెట్లతో రిలేషన్‌షిప్ చాలా అవసరం. గత ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడంలో విఫలమైన అథ్లెట్లు కాస్త ఒత్తిడితో ఉంటారు. వారిలో మానసిక సన్నద్ధతను పెంపొందించేలా సైకాలజిస్టులు ప్రోత్సహించాలి. అంతేతప్ప వారిని పతకాలు సాధించే రోబోలుగా చూడొద్దు. ఈ వైఖరి మారాలి. ముఖ్యంగా షూటింగ్ విభాగంలో పోటీ పడుతున్న షూటర్ల మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. నాలుగేళ్ల కింద ఎలా ఉన్నారు.. ఇప్పుడు ఎలా సన్నద్ధమవుతున్నారనేది బేరీజు వేసుకోవాలి’ అని చెప్పుకొచ్చాడు. ఇక అభినవ్ బింద్రా 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పసిడి పతకంతో మెరిశాడు. వ్యక్తిగత విభాగంలో దేశానికి స్వర్ణం అందించిన తొలి అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు. 2016 రియో ఒలింపిక్స్ అనంతరం బింద్రా వీడ్కోలు పలికాడు.