calender_icon.png 1 May, 2025 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ప్రాచుర్యంలోకి తేవడానికే ట్రైబల్ మ్యూజియం

05-04-2025 05:32:06 PM

శాసనసభ్యులు తెల్లం వెంకటరావు పాయం వెంకటేశ్వర్లు..

భద్రాచలం (విజయక్రాంతి): గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రాచుర్యంలోకి తేవడానికి ఐటీడీఏ ప్రాంగణంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం నాడు ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను వారు సందర్శించి మ్యూజియంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ చిత్రాలను కళాఖండాలను, పాతకాలపు మట్టి ఇండ్లు, చిన్నారులకు నిర్మాణం చేపట్టిన ఆట స్థలము బోటింగ్ పాయింట్, బాక్స్ క్రికెట్, బీచ్ వాలీబాల్ స్థలాలను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దట్టమైన అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసి గిరిజనుల జీవన విధానాలు, సాంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వారు పూజించే దేవతామూర్తులు సహజత్వాన్ని ఉట్టిపడేలా ఉన్నాయని, మ్యూజియంలోని పాతకాలపు కళాఖండాలను, గిరిజనులు ఉపయోగించే పనిముట్లను చూస్తే మా చిన్ననాటి స్మృతులు గుర్తుకు వస్తున్నాయని అన్నారు.

నేటితరం యువతీ యువకులకు గిరిజన జీవన విధానాలను ఆచార వ్యవహారాలను తెలియజేసే విధంగా మ్యూజియం ఏర్పాటు చేయడం నిజంగా గిరిజన సంస్కృతి అంతరించిపోకుండా సజీవంగా ఉంటుందని, ఇంతటి మహత్తరమైన మ్యూజియం ఏర్పాటుకు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మరియు ఐటీడీఏ యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో బాధ్యతగా మ్యూజియమును సర్వ సుందరంగా తయారు చేసినందున వారందరికీ అభినందిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం ప్రాజెక్టు అధికారి శాసనసభ్యులు ఇద్దరిని మ్యూజియంలోపల కళాఖండాలను పెయింటింగ్ చిత్రాలను మట్టి ఇళ్లను చూపించి వాటికి సంబంధించిన చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు మణెమ్మ, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, డీఎస్ఓ ప్రభాకర్ రావు, మ్యూజియం వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.