13-11-2025 12:12:59 AM
బేల, నవంబర్ 12 (విజయక్రాంతి) : తమ మారుమూల గ్రామాలకు వెళ్లాలంటే నరకయాతన అనుభవిస్తున్నామని పలు గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. గ్రామాలకు వెళ్లాలంటే రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ రోడ్డెక్కి నిరసన తెలిపారు. బేల మండలంలోని భాది, బెల్లూరి, జామిని గిరిజన గ్రామాల ప్రజలు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ భాది గ్రామం నుండి సిర్సన్న వరకు ప్రజలు పాదయాత్ర చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవాడంతో కాసేపు ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రఘునాథ్ రావ్ ఘటన స్థలానికి చేరుకొని వినతిపత్రం స్వీకరించారు. రోడ్డు విషయం గురించి కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ పిఓ దృష్టి కి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.