27 July, 2026 | 2:45 AM

ఎంపీ కొండా వ్యాఖ్యలపై దుమారం

27-07-2026 02:14 AM
  1. ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని డిమాండ్
  2. ప్రజాప్రతినిధిగా ఈ వ్యాఖ్యలు దురదృష్టకరమన్న పలు సంఘాలు

రంగారెడ్డి, జూలై 26 (విజయక్రాంతి): చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతుంది. గత కొంతకాలంగా ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జరిగిన సీజేపీ (జెన్ జీ) నిరసనలు, ఆందోళనలపై పోలీసులు విద్యార్థులపై జరిపిన లాఠీచార్జీను సమర్థిస్తూ, విదేశాల్లోనైతే కాల్చేశేవారని చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు నిరసన తెలిపే హక్కును గుర్తించాల్సిన బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం పట్ల విద్యార్థి, ప్రజా, మేధావి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ పోరాట చరిత్రలో కొండా కుటుంబానికి విశిష్టమైన గౌరవం స్థానం ఉంది. కేవీ రంగారెడ్డి తొలితరం ఉద్యమనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దిగ్గజ నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. జస్టిస్ కొండా మాధవరెడ్డి తెలంగాణ ఉద్యమకాలంలో నమోదైన కేసులను హైకోర్టు, సుప్రీంకోర్టులలో వాదించి ఖ్యాతి గడించారు. అలాంటి వారి ప్రతిష్ఠకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మచ్చను తెచ్చేవిగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యావంతుడు, పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడిగా ఉన్నా విశ్వేశ్వర్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడటం శోచనీయమని ఆయన రాజకీయ భవిష్యత్‌పై ఇలాంటి మాటలు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.