calender_icon.png 13 September, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వరం మార్చిన ట్రంప్!

12-09-2025 12:00:00 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాదరసం కలిగిన వ్యక్తిలా ప్రవర్తిస్తున్నాడు. రష్యాతో వ్యాపారం చేస్తుందన్న ఒక్క కారణంతో భారత్‌పై 50 శాతం సుంకాలు విధించి తన అక్కసు వెళ్లగక్కిన ట్రంప్ తాజాగా తన స్వరం మార్చారు. భారత్‌తో వాణిజ్య చర్చలకు తాము సిద్ధమని, మోదీ తనకు మంచి మిత్రుడని.. భారత్‌తో ఒక ఒప్పందం తప్పక కుదురుతుందని పేర్కొనడం గమనార్హం.

ట్రంప్ పోస్టుపై భారత ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందిస్తూ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇరు దేశాల ప్రజలకు ఉజ్వలమైన, మరింత సుసంపన్నమైన భవితవ్యం ఉండేలా చూసేందుకు కలిసి పనిచేస్తామని మోదీ తెలిపారు. ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పంద చర్చల కోసం వచ్చే వారం భారత అధికారులు అమెరికా వెళ్లనున్నట్టు తెలుస్తున్నది.

ట్రంప్ అకస్మాత్తుగా స్వరం మార్చడం వెనుక ఏదో ఒక అంతరగం దాగే ఉంటుంది. ట్రంప్ ఎప్పటినుంచో భారత్‌లో వ్యవసాయం రంగంలో వాటా కోసం తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారని గతంలో గ్లోబల్ ట్రేడ్ రీసెర్చి ఇనిషియేటివ్ కేంద్రాన్ని హెచ్చరిస్తూ ఒక నివేదిక విడుదల చేసింది. ఇప్పటివరకు, రెండు దేశాల రాయబారులు , మంత్రుల మధ్య ఐదు రౌండ్ల చర్చలు పూర్తయ్యాయి. గత ఆగస్టు 25న మరో దఫా చర్చలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ట్రంప్ చర్యతో భారత్ తన పర్యటనను వాయిదా వేసుకుంది.

ఈసారి వాణిజ్య చర్చల కోసం అమెరికా వెళ్తున్న భారత బృందం.. మొదట ఆ దేశ వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, ఔషధాలు, ఆటోమొబైల్ మార్కెట్లలో మన దేశ ఉత్పత్తులకు ఎంత అవకాశాలు దక్కుతున్నాయనే అంశంపై స్పష్టత తెచ్చుకోవాల్సిన అవసరముంది. ఎందుకంటే ఇప్పటికే టారిఫ్‌ల పెంపు భారత ఎగుమతులు, జీడీపీ అంచనాలపై ప్రభావం చూపించాయి. కచ్చితత్వమైన చర్చలు జరగనున్న వేళ టారిఫ్‌లు వెనక్కి తీసుకొనేటట్లు, ఆచరణ సాధ్యమైన పరిష్కారాలు, బలమైన మార్కెట్ అనుమతులు సాధించేందుకు ఒత్తిడి పెంచాల్సి ఉంటుంది.

అయితే భారత్.. రైతులు, మత్స్యకారులు , చిన్న వ్యాపారాలను రక్షించడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపును అమెరికా కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. 2030 నాటికి ద్వుపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. రైతులు, మత్స్యకారులు , చిన్న యూనిట్లకు సంబంధించిన సమస్యలపై ఎటువంటి రాజీ ఉండబోదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.

రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్‌పై ఒత్తిడి చేసిన ట్రంప్.. అదనపు సుంకాలతో దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ తలొగ్గేది లేదన్న సంకేతాలిచ్చారు. భారత్ ఎప్పుడూ స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటుందనే సందేశం ఇచ్చారు. రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామంటూ చెప్పారు. అయితే తాజాగా ట్రంప్ దిగిరావడంతో టారిఫ్ కథ ముగింపు దశకు చేరుకున్నట్టుంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో సుంకాల వార్‌కు ముగింపు పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.