3 September, 2026 | 5:21 AM

ఏసీబీకి చిక్కిన టీటీడీ డిప్యూటీ ఈవో

03-09-2026 | 02:55am
  1. మెండు లోకనాథం ఇంట్లో, ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు
  2. రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, ఆస్తుల గుర్తింపు?

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి అస్తుల ఆరోపణల నేపథ్యంలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి తిరుపతి పెదకాపు లేఔట్‌లోని లోకనాథం ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి 7 బృందాలుగా ఏర్పడిన అధికారులు తనిఖీలు చేశారు. తిరుమలలో లోకనాథంకు సంబంధించిన వసతిగృహంతో పాటు, తిరుపతిలోని లోకనాథం ఇద్దరు బావమరు దుల ఇళ్లతో పాటు, ఏర్పేడు మండలం చెల్లూరులోని అతని సోదరుడి నివాసంలో కూడా తనిఖీలు చేపట్టారు.

తిరుపతి ఎస్టీవీ నగర్ ఎస్బీఐ బ్రాంచ్ లాకర్లను పరిశీలిస్తున్నారు. ఏసీబీ దాడుల సమయంలో లోకనాథం ఇంట్లోనే ఉన్నారు. తనిఖీల్లో.. రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, స్థిర, చరాస్తులు గుర్తించినట్లు సమాచారం. 2011లో తితిదే డిప్యూటీ ఈవో భూపతిరెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో కేసు నమోదు చేసి ఉదయం నుంచి తనిఖీలు నిర్వహించినట్లు ఏసీబీ డిఎస్పీ శ్రీనివాస్‌రావు చెప్పారు.