200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జననం
- ఆస్పత్రి నుంచి ఇంటికి రథంలో ఘనంగా ఊరేగింపు
- ఇంటి లోటు తీరిందని తాత లింబాజీ భావోద్వేగం
- మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పరిలి పట్టణంలో ఘటన
ముంబై, సెప్టెంబర్2: మహారాష్ట్రలోని ఓ కుటుంబానికి ఎట్టకేలకు రెండు శతాబ్దాల కల నెరవేరింది. నాలుగు తరాల తర్వాత కూతరురు పుట్టడంతో దహిఫలే కుటుంబంలో (Dahiphale family) ఆనందాలు వెల్లువిరిసాయి. నవజాతశివువును మహాలక్ష్మిగా భావించి, ఆసుపత్రి నుంచి ఇంటి వరకు రథంలో ఘనంగా ఊరేగించారు. ఇంటికి తీసుకొచ్చి సంబరాలు చేసుకున్నారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పరిలి (పార్లి) పట్టణానికి చెందిన దహిఫలే (దహిఫాలే) కుటుంబంలో అద్భుతం జరిగింది.
ఈ కుటుంబంలో సుమారు 200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. తమ కుటుంబంలోకి ఆడపిల్ల అడుగుపెట్టడంతో దహిఫాలే కుటుంబ సభ్యులు చిన్నారికి ఘన స్వాగతం పలికారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గార్గి అనే నవజాత శిశువును ఆమె తల్లితో కలిసి ప్రత్యేకంగా అలంకరించిన భారీ రథంలో ఇంటికి తీసుకువచ్చారు. డప్పులు, తాళాల మోత, పాటలు, నృత్యాలతో సాగిన ఈ రథయాత్ర స్థానికంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.
కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఆనందోత్సాహాలతో చిన్నారిని స్వాగతించారు. ఆ పాపకు వేదకాలపు విద్వాంసకురాలైన ’గార్గి’ అని పేరు పెట్టారు. దహిఫలే కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, గత సుమారు 200 సంవత్సరాల కాలంలో తమ కుటుంబంలో ఆడపిల్ల పుట్టలేదని, ఇప్పుడు ఆడబిడ్డ జన్మించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. చిన్నారి తాత లింబాజీ దహిఫలే మాట్లాడుతూ.. కుటుంబంలో ఆడపిల్ల పుట్టాలనే కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందని, ఇది తమకు ఎంతో గొప్ప అదృష్టమని భావోద్వేగంతో తెలిపారు.
తన కోడలిని సొంత కూతురిలా చూసుకున్నానని, మనవరాలు పుట్టడంతో రథంపై ఊరేగిస్తూ ఇంటికి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. చిన్నారి నానమ్మ సురేఖ దహిఫలే మాట్లాడుతూ, తమ ఇంట్లోకి సాక్షాత్తు మహాలక్ష్మి అడుగుపెట్టిందని ఆనందం వ్యక్తం చేశారు. సాధారణం గా మగ సంతానం కోసం కోరుకునే సమాజంలో, కూతురు పుట్టడం వల్ల కలిగే ఆనందమే వేరని, కూతుళ్లను ఎంతో అల్లారుముద్దుగా పెంచుతామని చిన్నారి తండ్రి సంతోషం వ్యక్తం చేశారు.






