19న ఏజెన్సీ బందుకు తుడుం దెబ్బ పిలుపు
ఉట్నూర్, ఆగస్టు 16 : పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీలో ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ నిరుద్యోగ యువతకు 75 శాతం రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడంతో ఈ నెల 19న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ నిర్వహించేందుకు తీర్మానించినట్లు తుడుం దెబ్బ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు పుర్కా బాపురావు అన్నారు. ఆదివారం ఇంద్రవెల్లి మండలంలోని గిరిజన అమరవీరుల స్థూపం వద్ద తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందూరు దాదే రావు అధ్యక్షతన నిర్వహించిన ఉమ్మడి జిల్లా తుడుం దెబ్బ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.
తుడుం దెబ్బ సమావేశంలో నిర్ణయించిన మేరకు ఈ నెల 19న ఏజెన్సీ బందును స్వచ్ఛందంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ బందులో ఆదివాసీ సంఘాలు, ఆదివాసి ప్రజలు, పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారా ఏజెన్సీ ప్రాంత గిరిజన యువతి, యువకులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ భర్తీలో ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంద్రవెల్లి అమరవీరుల ఆశయ సాధన కమిటీ చైర్మన్ మెస్రం నాగనాథ్, సార్ మేడిలు కొట్నాక్ దేవుషా, సలాం శ్యాంరావుతో పాటు తుడుం దెబ్బ విద్యార్థి సంఘం నాయకులు, సర్పంచులు, వివిధ గ్రామాల్లో పటేల్ లు పాల్గొన్నారు.






