3 June, 2026 | 12:38 AM

రాష్ట్రంలో తుమ్మిడిహెట్టి హీట్!

03-06-2026 12:00 AM
  1. ఆసిఫాబాద్ సభతో ప్రాణహిత జలాలపై కొత్త చర్చ
  2. మహారాష్ట్రకు రేవంత్ హెచ్చరిక.. రైతాంగానికి భరోసానా?
  3. దశాబ్దాల కల సాకారమవుతుందా..!
  4. మరోసారి రాజకీయ వేదికలకే పరిమితమవుతుందా?

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 2 (విజయక్రాంతి ): ఒకప్పుడు తెలంగాణ సాగునీటి భవిష్యత్తును మార్చేస్తుందని భావించిన తు మ్మిడిహెట్టి ప్రాజెక్టు మరోసారి రాజకీయ చర్చల కేంద్రంగా మారింది.ఆసిఫాబాద్ జి ల్లాలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాణహిత జలాల అం శాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాయి.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వ ర్గాల్లోనే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లా రైతాంగంలోనూ కొత్త ఆశలు, కొత్త సం దేహాలకు కారణమయ్యాయి.‘ఏడాదిగా స మావేశానికి సమయం కోరుతున్నా స్పందన లేదు.

మాట్లాడుకుందాం... లేకపోతే ఆదిలాబాద్ ఉప్పెన అవుతుంది‘ అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు సాధారణ రాజకీయ విమర్శలు కాదని, తుమ్మిడిహెట్టి అంశాన్ని ప్రజా ఉద్యమంగా మలిచే సంకేతాలుగా పరిశీలకులు భావిస్తున్నారు.

నీటి కోసం నాలుగు దశాబ్దాల నిరీక్షణ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి సమస్య కొత్తది కాదు. గోదావరి, ప్రాణహిత వంటి మహానదులు జిల్లాను ఆనుకుని ప్రవహిస్తున్నప్పటికీ, వాటి నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే పరిస్థితి ఏర్పడలేదు. వ ర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడుతున్న వేలాది మంది రైతులు ప్రతి ఏడాది ప్రకృతి కరుణ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించారు. తుమ్మిడిహె ట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఉత్తర తెలంగాణకు సాగునీరు అందించాలనేది ఆ ప్రాజెక్టు ప్ర ధాన లక్ష్యం. కానీ అంతర్రాష్ట్ర అనుమతులు, సాంకేతిక అభ్యంతరాలు, రాజకీయ మార్పులతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు.

కాళేశ్వరం వచ్చాక మారిన సమీకరణాలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు స్థానంలో కాళేశ్వరం ప్రా జెక్టుకు ప్రాధాన్యం పెరిగింది. భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మించినప్పటికీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆశించిన స్థాయిలో సాగునీటి ప్రయోజనాలు అందలేదనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి.

ఇదే అంశాన్ని ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి, ‘లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆదిలాబాద్ రైతు పొలానికి నీరు రాలేదు‘ అని వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును ప్రాధాన్య అంశంగా తీసుకువచ్చినట్లు స్పష్టమవుతోంది.

అసలు చిక్కుముడి మహారాష్ట్రే

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నది మహారాష్ట్ర అనుమతి. ప్రాజెక్టు నిర్మాణంతో ఆ రాష్ట్రం లో కొంత భూభాగం ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్న కారణంతో గతంలోనే అ భ్యంతరాలు వ్యక్తమయ్యాయి.తెలంగాణ ప్ర భుత్వం భూసేకరణకు అవసరమైన పరిహా రం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ, మహారాష్ట్ర నుంచి స్పష్టమైన సానుకూల సంకేతాలు రాకపోవడం ప్రాజె క్టు పురోగతిని ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫడణవీస్ స్పందనపై రేవంత్ రెడ్డి బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేశారు.

కిషన్ రెడ్డికి రాజకీయ సవాల్

తుమ్మిడిహెట్టి అంశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాత్రను కూడా సీఎం నేరుగా ప్ర స్తావించడం గమనార్హం. మహారాష్ట్రతో చర్చ ల్లో మధ్యవర్తిత్వం చేయాలని కోరడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం కనిపిస్తోంది.ఒకవేళ కేంద్రం ఈ అంశంలో చొరవ చూపితే ప్రాజెక్టు ముందుకు కదిలే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ వివా దం మరింత రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రైతాంగం ఎదురుచూస్తున్నది...!

ప్రాజెక్టుల పేర్లు మారాయి. ప్రభుత్వాలు మారాయి. హామీలు మారాయి. కానీ ఆదిలాబాద్ రైతు ఎదురుచూస్తున్నది మాత్రం ఒక్కటే సాగునీరు.ప్రాణహిత-చేవెళ్ల, కాళేశ్వ రం, ఇప్పుడు మళ్లీ తుమ్మిడిహెట్టి. గత రెండు దశాబ్దాలుగా ఎన్నో ప్రకటనలు వచ్చినప్పటికీ రైతు పొలానికి నీరు చేరలేదు. అందుకే ఇప్పుడు రాజకీయ ప్రసంగాల కంటే కార్యాచరణపై రైతులు దృష్టి పెట్టారు.

ఉద్యమ రాజకీయాలకు నాంది పలుకుతుందా?

 ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కేవలం హెచ్చరికలేనా? లేక భవిష్యత్తులో పెద్ద ఎ త్తున రైతాంగ ఉద్యమానికి సంకేతాలా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి రాజకీయ ఒత్తిడి పెంచే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా ల్లో రైతాంగాన్ని సమీకరించే ప్రయత్నాలు కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు.

తేలాల్సింది ఒక్కటే...

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో ప్రస్తుతం బంతి మహారాష్ట్ర కోర్టులో ఉంది. తెలంగాణ ప్రభుత్వం రాజకీయంగా ఒత్తిడి పెంచుతోంది. రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది. కేంద్రం ఇప్పటివరకు మౌనం పాటిస్తోంది.ఆసిఫాబాద్ సభలో వినిపించిన హెచ్చరికలు రేపటి పరిణామాలకు నాంది అవుతాయా? మహారాష్ట్ర చర్చలకు ముందు కు వస్తుందా? లేక తుమ్మిడిహెట్టి మరోసారి రాజకీయ వాగ్దానాల జాబితాలోనే మిగిలిపోతుందా? ప్రశ్నలు ఉత్పన్నమవుతు న్నాయి.