3 June, 2026 | 12:39 AM

అక్రమ రవాణాగా ఇసుక.. అధికారుల కన్నులకు మసక!

03-06-2026 12:00 AM

పాలేరు వాగు నుండి తరలిస్తున్న అక్రమార్కులు

చోద్యం చూస్తున్న అధికారులు

అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికుల వేడుకోలు                                

కోదాడ  జాన్, 2: కోదాడ నియోజకవర్గ సరిహద్దుగా ప్రవహిస్తున్న పాలేరు వాగు అక్రమ ఇసుక దందాకు కేంద్ర బిందువుగా మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాగు అడుగు భాగం నుంచి ఇసుకను తోడి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వాగు మధ్యలో పడవలతో వెళ్లి నీటి గర్భంలో నుంచి ఇసుకను తవ్వి ఒడ్డుకు చేరవేసి, అక్కడి నుంచి ట్రాక్టర్లలో లోడ్ చేసి కోదాడతో పాటు పరిసర ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలు బహిరంగంగానే కనిపిస్తున్నాయి.  ఎంత జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో వారి కన్నులు మసకబారాయి అనే విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి .  

నిరంతరంగా కొనసాగుతున్న రవాణా

అనంతగిరి, కోదాడ మండలాల పరిధిలోని చనుపల్లి, పాలారం, కిష్టాపురం, శాంతినగర్, లకారం, గోండ్రియాల, కొత్తగూడెం, మంగళితండా తదితర గ్రామాల వద్ద ఈ అక్రమ దందా నిరంతరంగా కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను వేల రూపాయలకు విక్రయిస్తూ అక్రమార్కులు లక్షల్లో ఆదాయం పొందుతున్నారని సమాచారం. తెల్లవారుజామునే వాగు నుంచి తీసుకొచ్చిన ఇసుకను నిర్మాణ ప్రాంతాల్లో డంప్ చేస్తుండటంతో అక్రమ రవాణా ఎలాంటి భయం లేకుండా సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

ప్రమాదకరంగా గుంతలు 

ఇసుక తవ్వకాల కారణంగా పాలేరు వాగులో 5 నుంచి 10 అడుగుల లోతైన గుంతలు ఏర్పడి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఈ గుంతల్లో నీరు చేరి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాగు సహజ స్వరూపం దెబ్బతింటోందని, భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇసుక దందాలో కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములుగా ఉన్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 

మామూళ్ల మత్తులో అధికారులు!                             

భారీ స్థాయిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న నెలవారీ మామూళ్లతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, దందాను ప్రశ్నించిన వారిపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని ఆరోపిస్తున్నారు.  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పేరుతో అనుమతులు తీసుకుని వాటిని అడ్డుపెట్టుకొని అక్రమంగా అనేక ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం.

ఒక గ్రామానికి తీసుకున్న అనుమతులను మరో ప్రాంతంలో వినియోగిస్తున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. కోట్ల రూపాయలతో జరుగుతున్న ప్రభుత్వ భవన నిర్మాణాల్లో కూడా ఇదే అక్రమ ఇసుక వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇసుక రవాణా సమయంలో మార్గమధ్యంలో కొందరు దళారులు, మీడియా పేరుతో మరికొందరు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి పాలేరు వాగులో కొనసాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చర్యలు

అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చర్యలు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అక్రమంగా ఇసుక అన్ లోడింగ్, రవాణా చేస్తే చర్యలు తీసుకుంటాం. వాహనాలు సీజ్ చేస్తాం. కఠిన చర్యలు తీసుకుంటాం.

గోపాల్ రెడ్డి, రూరల్ ఎస్సై, కోదాడ