31 March, 2026 | 12:32 PM

ఇక కాంగ్రెస్‌ను నిలదీసుడే

16-05-2024 01:11 AM

డబుల్ డిజిట్ పక్కాగా సాధిస్తాం

పాలనే మొదలుకాలేదు.. పార్లమెంట్ ఎన్నికలను రెఫరెండం అన్న రేవంత్

హామీలు, గ్యారెంటీల అమలుకు ఆర్థిక వనరులు ఎలా సమకూరుస్తారో సీఎం చెప్పాలి

వేలాదిగా ఓట్లను తొలగించారు.. ఢిల్లీ మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో తెలం గాణలో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఊహించని విధంగా ఫలితాలు రాబోతున్నాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికలు జరిగిన తీరు, తమకు అందుతున్న సమాచారం ప్రకారం కమల వికాసం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

జూన్ 4న వెలువడే ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయని తెలిపారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు, ఆయన చేసిన తప్పుడు ప్రచారం, రాజ్యాంగం, రిజర్వేషన్ల ఎత్తివేత అంశం, మోదీపై వ్యక్తిగత ప్రచా రాన్ని తెలంగాణ ప్రజలు నమ్మలేదని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పోలింగ్ జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో తాము రాజీ పడబోమన్నారు. హామీలపై కాంగ్రెస్‌ను అడుగడుగునా నిలదీస్తామని చెప్పారు. 

రాష్ట్రంలో తమ వల్లే ఎవరైనా గెలుస్తారనే ధీమా ఉన్న మజ్లిస్ తీరును సైతం ప్రజలు గమనించారని, సరైన సమయంలో కీలెరిగి వాత పెట్టారని తెలి పారు. ఎంఐఎం పార్టీ సూట్‌కేసులు తీసుకుని అభ్యర్థులకు మద్దతు ప్రకటించిందని విమర్శించారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారని... అందుకే జనంలో మోదీ మరోసారి ప్రధాని కావాలనే ఆకాంక్ష స్పష్టంగా కనిపించిందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఈసారి బీజేపీకి అనుకూల వాతావరణం రావడం తమకు కలిసివచ్చిందని తెలిపారు. రిజర్వేషన్ల పరిధి లోని వర్గాలన్నీ ముందుండి బీజేపీకి ఓటేశాయని కిషన్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్ అనుకున్నా కూడా రిజర్వేషన్లను రద్దు చేయలేరని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో పాటు తన కంఠంలో ప్రాణమున్నంత వరకు రిజర్వేషన్లను రద్దు చేయబోమని ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ప్రజలు విశ్వసించారని అన్నారు.

గ్యారెంటీల మాటేమిటి..

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీల అమలు గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదని, సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ అని చెప్పి దాన్ని ఆగస్టు 15కు వాయిదా వేశారని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం ఇంతవరకు పాలనే మొదలు పెట్టలేదని.. కానీ పార్లమెంట్ ఎన్నికలు తన పాలనకు రెఫరెండం అని వ్యాఖ్యానించడం సిగ్గుచేటని అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రం భవిష్యత్తును ఆలోచించకుండా అనవసర ఖర్చులు చాలా చేశాయని ఫలితంగా తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితులున్నాయని తెలిపారు.

ఇకనైనా బురదజల్లే నీచ రాజకీయాలపై కాకుం డా హామీల అమలు దృష్టి సారించాలని  రేవంత్ రెడ్డికి హితవు పలికారు. దళితబంధు, కల్యాణలక్ష్మి, ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, పథకాల అమలుపై సమీక్ష నిర్వహించా లని అన్నారు. ఈ అంశాలన్నింటిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నా రు. పాత హామీలు మర్చిపోయిన రాహుల్ గాంధీ.. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణకు వచ్చి కొత్త హామీలు ఇచ్చి పోయాడని.. వీటన్నింటిపై రానున్న రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ చేపడతామన్నారు.

తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం..

తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం కనిపిస్తోందని, డబుల్ డిజిట్ పక్కాగా సాధిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ నూతన అధ్యాయం ప్రారంభం కానుందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు బీజేపీ సరైన ప్రత్యమ్నాయంగా అవతరించబోతోందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణలో తన అస్తిత్వాన్నే కోల్పోయిందన్నారు. గతంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఓటేసిన ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఏకపక్షంగా బీజేపీకి అండగా నిలిచారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గిందని, ఓటరు లిస్టును సంస్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

పోలింగ్‌కు రెండు రోజుల ముందు 20 నుంచి 30వేల ఓట్లు తొలగించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు గాను ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో సీడింగ్ చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో రిగ్గింగ్ జరిగిన బూత్‌ల వివరాలను సేకరిస్తున్నామని, అక్కడ రీపోలింగ్‌కు తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా తమకు 400కుపైగా సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.