03-12-2025 08:02:25 PM
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సలైట్లు మృతి చెందారు. ఈ ఎదురుకాల్పుల్లో రాష్ట్ర పోలీసుల ప్రత్యేక విభాగం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి)కి చెందిన ముగ్గురు సిబ్బంది మృతి చెందగా, మరో ఇద్దరు డీఆర్జీ జవాన్లు గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో ఇంకా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోందని వారు తెలిపారు. బీజాపూర్-దంతేవాడ జిల్లాల సరిహద్దులోని అడవిలో భద్రతా సిబ్బంది సంయుక్తంగా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరినప్పుడు కాల్పులు జరిగాయని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ పట్టిలింగం వెల్లడించారు.
దంతెవాడ, బీజాపూర్ నుండి డీఆర్జీకి చెందిన సిబ్బంది, స్పెషల్ టాస్క్ ఫోర్స్, రాష్ట్ర పోలీసు విభాగాలు, కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ - CRPF యొక్క ఎలైట్ యూనిట్) ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఎన్‌కౌంటర్ స్థలం నుండి ఇప్పటివరకు 12 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, అయితే వారి గుర్తింపు ఇంకా నిర్ధారించబడలేదని సీనియర్ ఐపీఎస్ అధికారి వివరించారు. అంతేకాకుండా, సింగిల్ లోడింగ్ రైఫిల్స్ (SLRలు), 303 ఇన్సాస్ రైఫిల్స్ , ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో బీజాపూర్‌లోని డీఆర్‌జీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ మోను వడాడి, కానిస్టేబుల్ దుకారు గొండే, జవాన్ రమేష్ సోధి అమరులయ్యారు. మరో ఇద్దరు డీఆర్‌జీ సిబ్బంది గాయపడ్డారని పట్టిలింగం స్పష్టం చేశారు. గాయపడిన జవాన్లకు వెంటనే ప్రథమ చికిత్స అందించామని, వారు ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడినట్లు ఐజీపీ తెలిపారు. వారికి తదుపరి వైద్య చికిత్స కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. భద్రతా దళాల తాజా చర్యతో, ఈ సంవత్సరం ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 275 మంది నక్సలైట్లు హతమయ్యారని బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ తెలిపారు.