ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు గల్లంతు
సత్తుపల్లి, మార్చి 29, (విజయక్రాంతి): సరదాగా ఈతకు వెళ్దామని వెళ్లిన ఆ బాలుర ఆశలు నీటిలోనే కలిసిపోయాయి. క్వారీ గుంతలో ఈతకు దిగి ఇద్దరు బాలురు గల్లంతైన ఘటన సత్తుపల్లి పట్టణ శివారులో తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటన వివరాలు: పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన శివ (13), నాగబాబు (14) ఆదివారం మధ్యాహ్నం సమయంలో స్థానిక మెట్టాంజనేయస్వామి ఆలయం సమీపంలో ఉన్న క్వారీ గుంత వద్దకు ఈత కోసం వెళ్లారు. అక్కడ నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేక లోపలికి దిగారు. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు నీట మునిగి గల్లంతయ్యారు.
రంగంలోకి అధికార యంత్రాంగం..
విషయం తెలుసుకున్న వెంటనే సత్తుపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి రిహనా కమల్ పాషా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆమె ఆదేశాల మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వార్డ్ కౌన్సిలర్లు జగన్నాథం శీను , శరత్ చంద్ర హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు..
ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్న శ్రీమతి రిహన కమల్ పాషా మరియు బాలుర తల్లిదండ్రులు, బంధువులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో ఎన్టీఆర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.




