ముగిసిన రెండు రోజుల జాతీయ సదస్సు
సికింద్రాబాద్,మార్చ్13 (విజయక్రాంతి): ఓయూలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ) వేదికగా ఉన్నత విద్య పునర్నిర్మాణం: వికసిత్ భారత్ 2047 దిశగా డిజిటల్ మార్గాలు అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ఘనంగా ముగిసింది. కన్సార్షియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ న్యూఢిల్లీ తో కలిసి రెండు రోజుల పాటు జరిగిన జాతీయ సదస్సులో దాదాపు ఎనిమిది రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
2047 నాటికి భారతదేశాన్ని జ్ఞాన ఆధారిత సూపర్ పవర్గా మార్చాలనే జాతీయ దార్శనికతకు అనుగుణంగా ఆయా అంశాల్లో నిష్ణాతులైన అధ్యాప కులు పాల్గొని మాట్లాడారు. డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, ఆధునిక సాంకేతిత, నూతన విద్యా సాంకేతికత, జాతీయ విద్యావిధానం సహా డిజిటల్ ఆధారిత ఉన్నత విద్యపై దేశంలోని పలు ప్రాంతాల నుంచి పరిశోధకులు 63 పరిశోధక పత్రాలు సమర్పించారు.
ప్రొఫెసర్ టి.టి శ్రీకుమార్, ప్రొఫెసర్ రాజారాం, డాక్టర్ సతీష్, డాక్టర్ రామకృష్ణ కంచలు పరిశోధక సెషన్లకు అధ్యక్షత వహించారు. డాక్టర్ సురెంద్రనాథ్ రెడ్డి, ప్రొఫెసర్ మోయిజ్, ప్రొఫెసర్ వై రామకృష్ణ, ప్రొఫెసర్ ప్యాట్రిక్ లు ఏఐ ఆధారిత ఉన్నత విద్య, ట్రాన్స్ఫార్మిగ్ అడ్మినిస్ట్రేషన్, మూక్స్ లో డాటా అనలిటిక్స్, మూక్స్ రూపకల్పన, ఏఐ ఆధారిత ఉన్నత విద్య, వికసిత్ భారత్ 2047 రూపకల్పనలో ఏఐ భాగస్వామ్యం తదితర అంశాలపై వివరించారు. శుక్రవారం జరిగిన ఈ సదస్సు ముగింపు సభకు ముఖ్య అతిథిగా ఓయూ యూజీసీ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ లావణ్య హాజరై మాట్లాడారు. డిజిటల్ విద్యపై ఓయూ ఈఎంఆర్సీ చొరవ అభినందనీయమని అభిప్రాయం వ్యక్తం చేశారు.




