calender_icon.png 6 December, 2024 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘క్రైం పోలీసులం.. పైసల్​ తియ్యి..’

07-10-2024 05:56:29 PM

అమాయకులను టోకరా కొడుతున్న ఇద్దరు యువకుల అరెస్ట్​..

జనగామ, (విజయక్రాంతి): ‘ఏయ్​ బండి ఆపు.. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నారు.. బండి కాగితాలు ఉన్నాయా.. మేం క్రైం బ్రాంచి పోలీసులం.. మీ దగ్గర ఉన్న పైసలు ఇచ్చి వెళ్లిపోండి’.. ఓ శుభకార్యానికి వెళ్లి బైక్​ పై వస్తున్న వారిని అడ్డగించి ఇద్దరు యువకులు అన్న మాటలివి.. క్రైం బ్రాంచ్​ పోలీసులమంటూ వారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు. నకిలీ పోలీసులుగా చెలామణి అవుతూ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను జనగామ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏసీపీ పార్థసారథి సోమవారం జనగామ పోలీస్​ స్టేషన్​లో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు.

దేవరుప్పుల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన నితిన్​ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి శనివారం రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో ఓ శుభకార్యానికి హాజరై అదే రోజు రాత్రి తిరుగు పయనమయ్యాడు. ఈ క్రమంలో రాత్రి 12 గంటల సమయంలో యశ్వంతపూర్​ పరిధిలో అదే గ్రామానికి చెందిన కాముని వినయ్​, యామంకి మధు అడ్డుకున్నారు. తాము క్రైం బ్రాంచ్​ పోలీసులమని చెప్పి వారికి పలు ప్రశ్నలు వేశారు. నితిన్​ వద్ద రూ.5‌‌00 తీసుకుని, మరో రూ.800 ఫోన్​ పే చేయించుకున్నారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా సీఐ దామోదర్​రెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు నిందితులను సోమవారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.