29 April, 2026 | 3:26 AM

దేవరకొండ మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

29-04-2026 01:03 AM

దేవరకొండ, ఏప్రిల్ 28: దేవరకొండ పురపాలక కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ అధికార కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ విజయంతో ముగిసింది. చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, కమిషనర్ పూర్ణ చందర్ నేతృత్వంలో ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగింది.

కాంగ్రెస్కు చెందిన 12 మంది కౌన్సిలర్లతో పాటు, అనూహ్యంగా 6 మంది బీఆర్‌ఎస్ సభ్యులు, ఒక బీజేపీ మరియు ఒక స్వతంత్ర కౌన్సిలర్ మద్దతు ప్రకటించడంతో ఎన్నిక ఏకపక్షమైంది. దీంతో గార్లపాటి దామోదర్ (జనరల్), నేతాళ్ల భాగ్యలక్ష్మి (జనరల్ మహిళా), ఎం.డి. మైనోద్దిన్ (మైనారిటీ జనరల్), మరియు ఏకుల శిపోరమ్మ (మైనారిటీ మహిళా) కో-ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ నూతన సభ్యులను అభినందిస్తూ పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా అంతా ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ సభ్యులు, వివిధ పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.