26 July, 2026 | 1:56 AM

క్షణికావేశంలో బాబాయి హత్య

26-07-2026 01:00 AM

అన్న కొడుకు ఘాతుకం

ఇంటి వద్ద పూడ్చి పెట్టేందుకు యత్నం

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఘటన

వరంగల్ (మహబూబాబాద్), జులై 25 (విజయక్రాంతి): డబ్బుల విషయంలో గొడవ పడి క్షణికావేశంలో సొంత బాబాయిని విచక్షణారహితంగా కర్రతో దాడి చేసి అన్న కొడుకు హత్య చేసిన ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ముసుగుల సాంబారెడ్డి (56) తమ్ముడు తిరుపతిరెడ్డి కుమారుడు రాజు వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో తిరుపతిరెడ్డి అనారోగ్యంతో ఇటీవల మరణించగా అతని పేరుపై చేసిన బీమా సొమ్ము ఐదు లక్షల రూపాయలు నామినీగా ఉన్న సాంబరెడ్డికి ఇటీవల బ్యాంకులో జమ అయ్యాయి. ఆ డబ్బులను శుక్రవారం సాయంత్రం తన బాబాయి సాంబారెడ్డితో కలిసి రాజు డ్రా చేసుకొని వచ్చారు.

ఈ డబ్బుల విషయంలో ఇరువురి మధ్య గొడవ జరిగిందని, దీనితో తీవ్ర ఆగ్రహంతో కర్రతో రాజు సాంబారెడ్డి పై దాడికి దిగడంతో ఆయన మృతి చెందాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు రాజు ఇంటివద్దె గొయ్యి తీసి మృతుడు సాంబారెడ్డి మృతదేహాన్ని పూచి పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, దుగ్గొండి సీఐ సాయి రమణ, ఎస్‌ఐ రణధీర్ రెడ్డి చేరుకొని నిందితుడైన రాజును అదుపులోకి తీసుకున్నారు.