25-07-2025 12:00:00 AM
నల్లగొండ పట్టణంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి. డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం పలు చోట్ల గుంతలు తవ్వి వదిలేశారు. పని పూర్తయిన తర్వాత సదరు కాంట్రాక్టర్ గుంతలను పూడ్చివేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో చేపట్టని పనులను రెండో విడతలో భాగంగా చేపడుతున్నారు.
అనేక చోట్ల పైప్లైన్, మ్యాన్ హోల్స్ నిర్మాణం కోసం చేపట్టిన పనులు ముందు చూపులేకుండా చేయడంతో ఆయా ప్రాంతాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణం లోని 20వ వార్డు గొల్లగూడలో అంధుల పాఠశాలకు వెళ్లే మార్గంలో గతంలో కవర్ కాని వీధుల్లో అండర్ గ్రౌండ్ పైప్‌లైన్, డ్రైనేజీ పనులను ఇటీవల చేపట్టారు.
అయితే పైప్‌లైన్, మ్యాన్ హోల్స్ కోసం ఎక్స్కవేటర్లతో గుంతలు తీసిన కాంట్రాక్టర్ పనులు పూర్తయ్యాక మట్టిని సరిగా గొల్లగూడలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు చదును చేయకపోవడంతో ఆ మార్గం ద్వారా వెళ్లే వాహ నాలు కాదు కదా కనీసం నడవలేని పరిస్థితి ఏర్పడింది. చిన్నచిన్న వర్షాలకే రోడ్డంతా బురదమయంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు.
డ్రైనేజీ పనులు పూర్తయినందన వెంటనే సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. ఇక నాలుగో వార్డు కేశరాజుపల్లి ఎస్సీ కాలనీలో కూడా ఇదే సమస్య ఉత్పన్నమైంది. కాలనీలో అసలే ఇరుకుగా ఉండే వీధుల్లో మ్యాన్ హోల్స్ నిర్మాణం కోసం పెద్దపెద్ద గుంతలను తీసి వాటిని సరిగా పూడ్చకపోవడంతో ఇళ్ల ఎదుట రోడ్డుపై మట్టి కుప్పలు దర్శనమిస్తున్నాయి. వెంటనే మట్టిని చదును చేసి రోడ్లు నిర్మాణం చేప ట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నాగరాజు, నల్లగొండ