calender_icon.png 7 August, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాత్యహంకారం!

25-07-2025 12:00:00 AM

శ్వేత జాతీయులకు అహంకారం ఇంకా ఉంది. తెల్లవాళ్ల దేశాల్లో    ఆ జాత్యహంకారం చావడానికి ఎన్ని చట్టాలు వచ్చినా ఇతర దేశాల నుంచి వలసవచ్చిన వారిపై ఆ అహంకారం బుసలు కొడుతూనే వుంది. స్థానికులను, ఆదివాసీలను అణచివేసి వలసరాజ్యాలు ఏర్పరచుకున్నప్పటి నుంచి జాత్యహంకారం, వివక్షను తెల్లవాళ్లు ఇంకా వీడలేదు. ఆస్ట్రేలియా విషయానికి వస్తే, దేశంలో మూడింట ఒక వంతు జనాభా ఇంగ్లీషు వాళ్లు కాదు.

బయటి దేశాల్లో పుట్టి ఆస్ట్రేలియాలో స్థిరపడినవారు. ఉద్యోగాల కోసం, మంచి జీవితం కోసం ఆస్ట్రేలియాకు వలసవచ్చే విదేశీయులు, మరీ ముఖ్యంగా దక్షిణాసియా వారంటే అక్కడి శ్వేత జాతీయులకు మంట. అందుకే అక్కడ జాత్యహంకార దాడుల సంఖ్య అంత కంతకూ పెరుగుతూ వస్తున్నది. దాడులు జరిగిన ప్రతిసారి ఇక నల్లవారు, గోధుమ వర్ణం గలవారు తమ దేశం విడిచిపోతారని వారు భావిస్తుంటా రు.

అడిలెయిడ్‌లో జూన్ 19న చరణ్‌ప్రీత్ సింగ్ అనే భారతీయ యువకునిపై ఇలాంటి జాత్యహంకార దాడి జరిగింది. అడిలెయిడ్‌లో గత శనివా రం రాత్రి విద్యుత్ దీపాల కాంతులతో ఏర్పాటు చేసిన ప్రదర్శన తిలకించేందుకు చరణ్ తన భార్యతో కలిసి వెళ్లాడు. తమ కారు పార్కు చేసేందు కు ప్రయత్నిస్తుండగా, ఎలాంటి గొడవ లేకుండానే ఐదుగురు దుండగులు చరణ్‌ను ఇనుపగొట్టాలతో విచక్షణారహితంగా కొట్టారు.

ముఖంపై పిడిగుద్దులు గుద్ది, ఇండియాకు తిరిగివెళ్లిపో అంటూ బూతులు తిట్టారు. పలు గాయాలతో చరణ్ రోడ్డు పక్కన స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఈ దాడి ఆస్ట్రేలియాలోని భారతీయులకు ఆగ్రహం కలిగించింది. ఆస్ట్రేలియాలోని విదేశీ విద్యార్థులు, వలసదారుల భద్రతపై కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. జాత్యహంకారంతో జరిపిన ఈ దాడిని సామాజిక మాధ్యమాల్లో వేలాదిమంది ఖండించారు.

ఇలాంటి దాడులను సహించే ది లేదని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఆస్ట్రేలియాలో జాత్యహంకార కార్యకలాపాలు ఆగలేదు. మెల్‌బోర్న్‌లోని స్వామినారాయణ్ ఆలయంపై పిచ్చిరాతలు రాశారు. హిట్లర్ బొమ్మ.. భారతీయులను ఉద్దేశించి ఆస్ట్రేలియా విడిచి వెళ్లాలన్న హెచ్చరికతో ఆలయం గోడలను పాడు చేశారు. అక్కడికి దగ్గరలోని రెండు ఆసియా రెస్టారెంట్లపై కూడా ఇవే పిచ్చి రాతలు కనిపించాయి.

ఆసియన్లను, ముఖ్యంగా భారతీయుల ను రెచ్చగొట్టేందుకు, లేదంటే భయపెట్టేందుకు శ్వేతజాతి అహంకారంతో కొందరు ముష్కరులు ఈ దాడులకు పాల్పడినట్టు స్పష్టమవుతున్నది. అహంకారంతో, విద్వేషంతో జరుగుతున్న దాడులు అక్కడి భారతీయులకు కలవరం కలిగిస్తున్నాయి. భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ఉద్యో గులను మొదటి నుంచి ఆస్ట్రేలియా ఆకర్షిస్తూనే వుంది. గత ఏడాది స్కిల్డ్ వర్కర్లకు ఆస్ట్రేలియా ఇచ్చిన వీసాలను గమనిస్తే ఐదుగురిలో ఒకరు భారతీయుడే.

ఆస్ట్రేలియాలోని జీవన ప్రమాణాలు, హెల్త్ కేర్, సామాజిక భద్ర త భారతీయులు ఆ దేశాన్ని ఎంచుకునేందుకు అంశాలుగా ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు వెళ్లే విదేశీ విద్యార్థుల్లో 16 శాతం భారతీయ విద్యార్థులేనని 2024 లెక్కలు చెబుతున్నాయి. దాదాపు లక్షా 40 వేల మంది విద్యార్థులు ఆస్ట్రేలియా యూనివర్సిటీలను ఎంచుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో భారతీయుల భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకం కాకూడదు.