10-08-2025 10:08:47 AM
బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించారు కామారెడ్డి జిల్లా(Kamareddy District) పిట్లంకు చెందిన అబ్దుల్ మతీన్. చిన్నతనంలోనే తండ్రి అబ్దుల్ హమీద్‌ను కోల్పోయి, పినతండ్రి అబ్దుల్ మజీద్, అన్నయ్య అబ్దుల్ మాలిక్ పర్యవేక్షణలో పెరిగారు. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా చదువును మాత్రం మానివేయలేదు. పిట్లం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే పేపర్ బాయ్‌గా పనిచేసి, తన జీవితాన్ని కష్టపడి ముందుకు నడిపించారు. హైదరాబాద్‌కు వెళ్లి ఉస్మానియా యూనివర్సిటీలో MBA, M.Com పూర్తి చేశారు. ప్రస్తుతం, ఒక ప్రఖ్యాతిగాంచిన డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ఇటీవల ఆయన "రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ప్రవర్తనా అంశాల ప్రభావాన్ని అన్వేషించడం, హైదరాబాద్ పెట్టుబడిదారులపై ఒక అధ్యయనం" అనే అంశంపై Ph.D. పూర్తి చేశారు. సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఉషా కిరణ్ ఆధ్వర్యంలో మతీన్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. తన విజయం గురించి అబ్దుల్ మతీన్ మాట్లాడుతూ.. "తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు, పేదరికం ఉన్నా కష్టపడితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చు" అని పేర్కొన్నారు. తన పట్టుదల, కష్టంతో పేదరికాన్ని జయించి ఉన్నత స్థాయికి ఎదిగిన అబ్దుల్ మతీన్ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మతీన్ డాక్టరేట్ పట్టా పొందడంపై ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.