11-11-2025 12:00:00 AM
కరీంనగర్, నవంబర్10(విజయక్రాంతి): మోదీ గిఫ్ట్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఎగ్జామ్ ఫీజును చెల్లిస్తానని ప్రకటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సోమవారం రోజున కరీంనగర్ జిల్లా టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు రూ.5,45, 375 మొత్తాన్ని చెల్లించారు. ఈ మేరకు బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, నాయకులు గుజ్జు శ్రీనివాస్ లు జిల్లా కలెక్టర్ ను కలిసి పరీక్షా ఫీజు మొత్తానికి సంబంధించిన చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికి ఈ ఏడాది టెన్త్ ఎగ్జామ్ ఫీజును పూర్తిగా చెల్లించేందుకు ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిర్ణయం తీసుకొని, ఆమేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారని తెలిపారు.
అధికార వర్గాలు తెలియజేసిన ప్రకారం కరీంనగర్ జిల్లాలో 4, 847, మంది 10వ తరగతి విద్యార్థులున్నారనీ, వీరందరికీ పరీక్ష ఫీజు కోసం కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్‌తన వేతన డబ్బులు నుండి రూ.5,45, 375 ల మొత్తాన్ని చెల్లించడం జరిగిందన్నారు. బండి సంజయ్ కుమార్ అందజేసిన మొత్తాన్ని చెక్ రూపంలో జిల్లా కలెక్టర్ కు అందజేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారేనని, .
వారిలో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల పరీక్ష ఫీజుల విషయంలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో బండి సంజయ్ తన నియోజకవర్గ పరిధిలోని ఆయా స్కూళ్లలో చదివే విద్యార్థుల ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు మొత్తాన్ని భరించి , వారికి చేయూతనిచ్చిన కేంద్రమంత్రి బండి సంజయ్ కి బిజెపి కరీంనగర్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగాచెప్పారు.