calender_icon.png 8 December, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవాజీ కుటుంబాన్ని పరామర్శించిన కేంద్రమంత్రి బండి సంజయ్

08-12-2025 05:56:38 PM

హనుమకొండ (విజయక్రాంతి): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) జేష్ఠ కార్యకర్త రేవా కోటేశ్వరరావు కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. వరంగల్ డాక్టర్స్ కాలనీలోని రేవాజీ నివాసానికి వెళ్లి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, రేవాజీ వంటి అఖండ త్యాగి, క్రమశిక్షణ గల స్వయంసేవకుడు ఇక లేరనే విషయం తీవ్ర విషాదం కలిగించిందని చెప్పారు.

వరంగల్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ తొలి తరం స్వయం సేవ కుడిగా రేవాజీ ఎన్నో దశాబ్దాల పాటు సంఘ సేవలో అహర్నిశలు కృషి చేసినట్లు ఆయన తెలిపారు. రేవాజీ మహబూబియా హైస్కూల్లో హిందీ పండిట్గా పనిచేసినప్పటికీ, ప్రతీవారాంతం గ్రామాల్లో శాఖా కార్యకలాపాలకు హాజరవుతూ సంఘ్ విస్తరణకు అంకితం అయిన జీవితాన్ని గడిపారని చెప్పారు. ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ కాలంలో రేవాజీ అజ్ఞాతంలో ఉండి ప్రజల్లో అవగాహన కల్పించారని, రామజన్మభూమి ఉద్యమంలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కీలక పాత్ర పోషించినట్లు బండి సంజయ్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, ఇతర బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు పాల్గొన్నారు.