‘గల్ఫ్’లో కోటిమంది ఇండియన్లు
ఇప్పటివరకు స్వదేశానికి 67 వేల మంది
మిగిలిన వారి భద్రతపై ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ సమీక్షలు
లోక్‌సభ వేదికగా కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన
న్యూఢిల్లీ, మార్చి 9: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల సంఖ్య, వారి భద్రతపై సోమవారం కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది. సోమవారం లోక్‌సభలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రసంగిస్తూ.. ‘గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. వారంతా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగినందున, ఆయా దేశాల నుంచి ఇప్పటివరకు 67 వేల మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. మిగిలిన భారతీయులకు ప్రస్తుతం పశ్చిమాసియాలో ఎలాంటి ముప్పు లేదు’ అని ప్రకటించారు. భారతీయుల భద్రతపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. అవసరం అనుకుంటే, భారతీయులందరినీ ఇక్కడికి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.
9 వేల మంది తరలింపునకు చర్యలు
ఇరాన్‌లో ప్రస్తుతం 9 వేల మంది భారతీయులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే, ఇక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఈ 9 వేల మంది అక్కడే ఉండటానికి మొగ్గు చూపారు.
వీరిలో అత్యధికులు జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారే. వీరంతా రాజధాని టెహ్రాన్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలోని కోమ్ నగరంలో నివసిస్తున్నారు. ఇరాన్ తన గగనతలాన్ని మూసివేయడంతో, వారిని రోడ్డు మార్గం ద్వారా ఆర్మేనియా లేదా తుర్కేనిస్తాన్ దేశాలకు తరలించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. అక్కడి నుంచి విమానాల్లో ఇండియాకు చేర్చే మార్గాలను అన్వేషిస్తున్నది.




