బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసినట్లే.. కాంగ్రెస్ మోసం చేస్తోంది
భవిష్యత్ లో తెలంగాణలో బీజేపీ అధికారం
హైదరాబాద్ : సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో బుధవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర బొగ్గు, గనుల శాఖామంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు మహోత్సవం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి బిజెపి జాతీయ కార్యదర్శి విజయ రహత్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా సభ్యత్వాలు నమోదు చేస్తున్నాం.. కార్యకర్తలు ఇష్టంతో సభ్యత్వాలు నమోదు చేయించాలన్నారు. కుటుంబ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ సిద్ధాంత పరంగా పనిచేస్తోందని వివరించారు. దేశంలో అత్యధికంగా సభ్యత్వాలు ఉన్న పార్టీ బీజేపీ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ బలపడాలి అంటే సభ్యత్వ నమోదు విజయవంతం కావాలని ఆయన వెల్లడించారు.
రాజకీయాల్లో పోటీతత్వం ఉన్నా.. ప్రధానిగా మోడీ మూడోసారి గెలిచారని ఆయన తెలిపారు. భవిష్యత్ లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తోందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. గతంలో లాగాలనే ఆన్ లైన్ లో సభ్యత్వం నమోదు చేయించాలని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో 70 లక్షలకు పైగా ఓట్లు బీజేపీకి వచ్చాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. రుణమాఫీపై రైతులకు ఆశలు పెట్టి.. 50 శాతం మంది రైతులకు కూడా చేయలేదని ఆరోపించారు. ఏ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఏ విధంగా ప్రజలను మోసం చేసిందో.. అలాగే కాంగ్రెస్ కూడా మోసం చేస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు.






