దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఉంది: కిషన్ రెడ్డి
హైదరాబాద్: రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అధ్వానంగా ఉందని ఆరోపించారు. దళారులు, అధికారులు, ప్రభుత్వం మధ్య రైతులు నలిగిపోతున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ బస్సు యాత్రతోనే(BJP Bus Yatra) ప్రభుత్వంలో చలనం వచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ధాన్యం తీసుకోవట్లేదని, ముఖ్యంత్రి, మంత్రులు చెప్తున్నారని మండిపడ్డారు. ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వం పని అని కేంద్రమంత్రి సూచించారు.
రైతుల జీవితాలతోకాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నబియ్య సేకరించి, దొడ్డు బియ్యం వదిలేశారని తెలిపారు. దొడ్డు బియ్యం పండించే రైతులను గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చాందని కిషన్ రెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరించడం చేతకాక కేంద్రంపై నెపం మోపుతోందని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు.
నాణ్యమైన సన్నబియ్యాన్ని పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారని కేంద్రమంత్రి ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి నాసిరకం సన్నబియ్యం తెచ్చి తెలంగాణ ప్రజలకు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గోనె సంచులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పండే 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్రం సేకరించిందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన కోటా పూర్తి చేసిన తర్వాత.. పెంచాలని కోరుదామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ కొరత సాకుతో ధాన్యం కొనుగోలు చేయలేదని కిషన్ రెడ్డి వెల్లడించారు.






