29-07-2025 01:34:21 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా పెట్రేగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం డ్రగ్స్‌కు కేరాఫ్ సెంటర్‌గా మారింది. నగరానికి విశాఖ, ఒడిషా, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. అలాగే ఇతర ప్రాంతాలకు హైదరాబాద్ మీదుగానే డ్రగ్స్, గంజాయిని తరలిస్తున్నారు.
యువత, ముఖ్యంగా విద్యార్థులలో వేగంగా పెరుగుతున్న మాదకద్రవ్యాల వ్యసనంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. రాష్ర్టంలో డ్రగ్స్ సమస్య తీవ్రతకు నిదర్శనంగా, 2025 జనవరి నుంచి మే వరకు కేవలం ఐదు నెలల్లోనే 646 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కేసులు నమోదై, 1,166 మందిని అరెస్టు చేసినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
డ్రగ్స్ వ్యసనం కేవలం కళాశాల విద్యార్థులకే పరిమితం కాకుండా పాఠశాల స్థాయికి కూడా పాకుతోందని, విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును కోల్పోయి వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఆర్థిక, సామాజిక, మానసిక సమస్యలకు డ్రగ్స్ వ్యసనం ఒక ప్రధాన కారణమవుతోంది.
చెడు సావాసాలు, సరదాగా అలవాటు చేసుకోవడం, పార్టీల పేరుతో డ్రగ్స్, గంజాయికి అలవాటు పడటం వంటివి యువతను ఈ వ్యసనం వైపు నెట్టివేస్తున్నాయి. ఈ ఐదు నెలల వ్యవధిలో 3,011 కిలోల ఎండు గంజాయితో పాటు 92 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) నివేదికలు తెలియజేస్తున్నాయి.
బయటపడుతున్న ముఠాల లింకులు
రాష్ర్టంలో డ్రగ్స్ భూతాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎక్సుజ్ శాఖతో పాటు యాంటీనార్కోటిక్స్ బ్యూరో ఆధీనంలోని ‘ఈగల్’ టీం కూడా భుజం భుజం కలిపి చేస్తున్న పోరాటంలో అద్భుత విజయాలు సాధిస్తోంది. రాష్ర్టంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో డ్రగ్స్ పెడ్లర్ల ఈగల్ ఆటకట్టిస్తోంది. ఈ టీం వచ్చిన తర్వాతే చాలా పెద్ద డ్రగ్స్ ముఠాలు, వాటి వెనకున్న లింకులు బయటపడ్డాయి.
2025 జనవరి నుంచి మే వరకు ఐదు నెలల్లో ఎక్సుజ్ శాఖ 646 కేసులు నమోదు చేసి 1,166 మందిని అరెస్టు చేసింది. 343 వాహనాలను సీజ్ చేయగా, 3,011 కిలోల పొడి గంజాయి, 92 గంజాయి మొక్కలు, 8.38 కిలోల ఆల్ప్రజోలం స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా 204 కేసులు నమోదు కావడం, 356 మంది అరెస్టు కావడం, 101 వాహనాలు సీజ్ చేయడం గమనార్హం.
జూలై 18న ఈగల్ బృందం బోయిన్‌పల్లిలో అంతర్రాష్ర్ట నల్లమందు ముఠాను పట్టుకుంది. రాజస్థాన్ లోని జలోర్ జిల్లాకు చెందిన సవ్లారామ్ బిష్ణోయ్, హాపూరామ్ బిష్ణోయ్, లలారామ్ బిష్ణోయ్ అనే ముగ్గురిని అరెస్టు చేసి 3.25కేజీల నల్లమందును, రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నల్లమందు విలువ సుమారు రూ.17 లక్షలు ఉంటుందని అంచనా. రాజస్థాన్ నుంచి ప్రధానంగా నల్లమందు సరఫరా అవుతున్నట్లు ఈ అరెస్టుతో తేలింది.
జూలై 12న గచ్చిబౌలిలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దగ్గర ఈగల్ బృందం నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్‌లో 14 మంది గంజాయి వినియోగదా రులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, ఇంజినీర్లు, డాక్టర్లు వంటి వివిధ వర్గాల వారు ఉన్నారు. మహారాష్ర్టకు చెందిన సందీప్ అనే ప్రధాన పెడ్లర్ వాట్సాప్ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నాడని తేలింది.
ఈ ఘటనతో మహారాష్ర్ట నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా అవుతున్నట్లు స్పష్టమైంది. పట్టుబడ్డ వారందరినీ డ్రగ్స్ డీ-అడిక్షన్ సెంటర్లకు పంపిస్తు న్నారు. ఈ తరహా ఆపరేషన్లలో ఎక్సుజ్ శాఖ కూడా తమ వంతు సహాయాన్ని అందిస్తూ, మాదకద్రవ్యాల సరఫరా గొలుసును ఛేదించడంలో కీలక భూమిక పోషిస్తోంది.
పబ్బుల్లో డ్రగ్స్ పార్టీలు..
కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ యజమాని ఏ సూర్య అరెస్టుతో హైదరాబాద్‌లోని పబ్బుల్లో జరుగుతున్న డ్రగ్స్ దందా బయటపడింది. సూర్య వద్ద ఓజీ వీడ్, ఎక్సటసీ పిల్స్, కొకైన్ వంటి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. అతడు నగరంలోని పబ్బులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సూర్య తన టాటా స్కార్పియో వాహనంలో డ్రగ్స్ తీసుకొస్తుండగా సైబరాబాద్ నార్కోటిక్ పోలీసు లు పట్టుకున్నారు.
మహిళా కొరియర్లు పాదరక్షల్లో డ్రగ్స్ దాచి తరలించినట్లు కూడా తేలింది. ప్రిజం పబ్ (ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్), ఫార్మ్ పబ్ (రోడ్ నం. 45, జూబ్లీహిల్స్), బర్డ్‌బాక్స్ (మాదాపూర్), బ్లాక్ 22 (హైటెక్ సిటీ) వంటి ప్రముఖ పబ్బుల యజమానులు, అలాగే రాజా శ్రీకర్ (క్వేక్ అరీనా పబ్, కొండాపూర్), పృథ్వీ వీరమాచినేని (జోరా పబ్, రోడ్ నం. 36), రోహిత్ మెడిశెట్టి (బ్రాడ్‌వే పబ్, రోడ్ నం. 45) వంటి వారి ప్రమేయంతో డ్రగ్స్‌తో కూడిన పార్టీలు నిర్వహించినట్లు అంగీకరించారు.
దీంతో ఈ పబ్బుల యజమానులపై కేసులు నమోదయ్యాయి. నైజీరియన్ల నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి పబ్బులు, కొందరు ప్రముఖులకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. సూర్య అందించిన సమాచారంతో ఈగల్ టీం 9 పబ్బులపై దాడులు చేసి కేసులు పెట్టింది.నైజీరియా, ఢిల్లీలోని పరిచయాల ద్వారా సూర్య విదేశీ డ్రగ్స్ సరఫరాదారుల నుంచి మాదక ద్రవ్యాలు తెప్పించుకున్నాడు.
నైజీరియన్ జాతీయుడు నిక్ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ డెలివరీ తీసుకుని ఆన్‌లైన్ లో డబ్బులు చెల్లించినట్లు తేలింది. నైజీరియన్ మహిళలే కొరియర్లుగా డ్రగ్స్‌ను హైద రాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు సప్లు చేశారని దర్యాప్తులో బయటపడింది. ఒక గ్రాము సింథటిక్ డ్రగ్ చేరవేస్తే రూ.1,000, అదే డ్రగ్స్ విక్రయిస్తే రూ.3,000 చొప్పున డ్రగ్ పెడ్లర్లు చెల్లించినట్లు తేలింది.
సూడాన్ దేశానికి చెందిన ఓ యువతిని కూడా స్మగ్లర్లు ఏజెంట్‌గా మార్చి కొకైన్, ఎక్సటసీ పిల్స్ సరఫరా చేయించినట్లు వెలుగుచూసింది. నాంప ల్లిలో ముంబయికి చెందిన అంతర్ రాష్ర్ట డ్రగ్స్ ముఠా నుంచి 100 గ్రాముల మెఫిడ్రోన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సం గారెడ్డిలో అల్ఫాజోలంను పట్టుకొని, ఈ రాకెట్ నిందితులకు చెందిన రూ.30 కోట్ల విలువైన ఆస్తులను ఈగల్ టీం సీజ్ చేసింది.
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో 46 కిలోల గంజాయిని, ఉప్పల్ క్రికెట్ స్టేడియం పార్కింగ్ ఏరియా వద్ద 32 పిల్స్ డ్రగ్స్‌ను సీజ్ చేసింది. రూ.1.25 కోట్ల విలువ గల 550 గ్రాముల ‘సెలబ్రిటీ కొకైన్’ను టీజీనాబ్ అధికారులు సీజ్ చేసి, నైజీరియన్ దేశస్థుడిని అరెస్టు చేశారు. డ్రగ్స్ హవాలా ముఠాల ఆర్థిక లింకులపై టీజీనాబ్ దృష్టి సారించగా, నైజీరియా కు వారం రోజుల్లోనే 150 బ్యాంకుల ద్వారా రూ.2.1 కోట్లు పంపించినట్లు తేలింది.
ప్రజల సహకారం అవసరం
డ్రగ్స్ ఫ్రీ స్కూళ్ల లక్ష్యంగా మా బృందం పనిచేస్తోంది. జూనియర్ లెక్చరర్లు, విద్యాశాఖాధికారులను చైతన్యవంతులను చేసి వారి సహాయంతో డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం చర్యలు చేపడుతున్నాం. ఎన్డీపీఎస్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వవద్దని సుప్రీం కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు డ్రగ్స్ కేసుల్లో నిందితులకు బెయిల్ లభించడం కష్టతరం చేస్తుంది. డ్రగ్స్ వాడకం వల్ల నేరగాళ్లుగా మారుతున్నారు. రాష్ర్టం నుంచి డ్రగ్స్ భూతాన్ని పూర్తిగా తరిమికొట్టేందుకు ప్రజల సహకారం కూడా అవసరం.
సందీప్ శాండిల్యా,
డైరెక్టర్, తెలంగాణ
యాంటీనార్కొటిక్స్ బ్యూరో
పిల్లల కదలికలను గమనించాలి..
నల్లమందు, గంజాయిలాంటి డ్రగ్స్ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. గుండె సమస్యలు, ఆకలి లేకపోవడం, లైంగిక సమస్యలు వంటి అనేక రోగాలకు దారి తీస్తాయి. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను గమనించాలి. ఎవరికైనా డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్లకు టోల్-ఫ్రీ నంబర్ 1908 లేదా వాట్సాప్ నంబర్ 8712671111 సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చినవారికి రివార్డు ఇవ్వడంతో పాటు వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
షానవాజ్ ఖాసీం, డెరెక్టర్,
ప్రొహిబిషన్ అండ్ ఎక్సుజ్ ఎన్‌పోర్స్‌మెంట్