26 May, 2026 | 1:56 AM

30 వరకు అటు ఎండలు.. ఇటు వర్షాలు

26-05-2026 12:43 AM

వడగాల్పులతో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత, వడగాల్పులతోపాటు పలు జిల్లాల్లో వర్షాలు కూడా కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 30 వరకు పలు జిల్లాల్లో వడగాల్పులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని తెలిపింది. మంగళవారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో వడగాల్పులు వీస్తాయని రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని సూచించింది. బుధవారం జయశంకర్, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో వడగాల్పులు వీస్తాయని రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది.

ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాం బ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. ఈనెల 28 నుంచి ౩0 వరకు పలు జిల్లాల్లో వడగాల్పులు, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

సోమవారం నల్లగొండలో 46.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదుకాగా, భద్రాద్రి కొత్తగూడెంలో 46.4, జగిత్యాల్‌లో 46.4, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 46.4, నిజామాబాద్‌లో 46.4, సూర్యాపేటలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక అత్యల్పంగా మహబూబ్‌నగర్‌లో 23.1 డిగ్రీలు నమోదైంది.