calender_icon.png 11 September, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాడలేని బోనస్?

11-09-2025 01:34:31 AM

-సన్నధాన్యం బోనస్ కోసం రైతుల నిరీక్షణ 

-ఐదు నెలలుగా ఎదురుచూపులు

-జాడలేని సన్న ధాన్యం బోనస్ 

-ఐదు నెలలుగా అన్నదాతల నిరీక్షణ

మహబూబాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : సన్నధాన్యం పండిస్తే క్వింటాలుకు 500 రూపాయల చొప్పున ప్రభుత్వం బోనస్ ఇస్తుందని ప్రకటించడంతో కష్టనష్టాలు కోర్చి పండించిన పంటను ప్రభుత్వానికి విక్రయించిన అన్నదాతలకు ప్రభుత్వం ఆరు నెలలు కావస్తున్నా ‘బోనస్’ ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత యాసంగి సీజన్లో తన ధాన్యం పండించిన రైతులు ప్రభుత్వానికి విక్రయించగా వానాకాలం పంట సాగు సగానికి వచ్చిన బోనస్ చెల్లించకపోవడంతో బోనస్ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని నిరీక్షిస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గత యాసంగి సీజన్లో 1,26,436 ఎకరాల్లో సన్న రకం వరి పంట సాగు చేశారు. ఇది జిల్లా వ్యాప్తంగా సాగైన వరి పంటలో 84 శాతం కావడం విశేషం. యాసంగిలో తక్కువ దిగుబడి వచ్చినప్పటికీ బోనస్ పై ఆశతోనే అన్నదాతలు సన్నరకం వరి సాగు చేపట్టారు. గత ఏప్రిల్ నెల నుంచి మే చివరి వరకు ప్రభుత్వం రైతులు పండించిన సన్నధాన్యం, దొడ్డు ధాన్యం సేకరించింది. దొడ్డు రకం ధాన్యానికి క్వింటాలకు 2,300, సన్న రకం ధాన్యానికి 2,320 రూపాయలకు తోడు అదనంగా 500 రూపాయలు బోనస్ ప్రకటించింది.

అయితే ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం బోనస్ చెల్లించకుండా మిగిలిన పైసలను ధాన్యం కొన్న వారం పది రోజుల్లోనే రైతు బ్యాంకు ఖాతాలో జమ చేసింది. కేవలం బోనస్ డబ్బులు మాత్రమే ధాన్యం కొనుగోలు చేసి ఆరు మాసాలు కావస్తున్న చెల్లించకుండా పెండింగ్ పెట్టింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,341.569 మెట్రిక్ టన్నులు రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. సన్న రకం విక్రయించిన రైతులకు క్వింటాలకు 500 చొప్పున బోనస్ డబ్బులు 67,07,84,500 రూపాయలు బకాయి చెల్లించాల్సి ఉంది.

కష్టపడి పండించిన సన్న రకం ధాన్యానికి బోనస్ డబ్బులు ఇస్తే తమకు ప్రస్తుత పంటల సాగుకు ఉపయోగపడేవని, దిగుబడి తక్కువైనా బోనస్ కోసమే సన్నధాన్యం పండించామని, దొడ్డు రకం దాన్యం పండించిన రైతులకు దిగుబడి అధికంగా వచ్చి వెంటనే డబ్బులు ఖాతాలో పడ్డాయని, తాము ఆశతో సాగు చేస్తే నిరాశ చెందాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వేల మంది రైతులకు సన్న రకం విక్రయించిన బోనస్ డబ్బులు బకాయి చెల్లించకపోవడంతో ఆరు మాసాలుగా ఆశతో ప్రభుత్వ ప్రకటన కోసం నిరీక్షిస్తున్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లించగా, బోనస్ డబ్బులు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాల్సి ఉందని, అందుకే జాప్యం జరుగుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

ఇంకెప్పుడిస్తారు బోనస్..?

దిగుబడి తక్కువ వస్తుందని తెలిసినప్పటికీ గవర్నమెంట్ క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడంతో ఆశతో రెండు ఎకరాల భూమిలో వరి పంట సాగు చేశాను. పంట పండిన తర్వాత 36 క్వింటాళ్ల వడ్లను ఐకెపి కొనుగోలు కేంద్రంలో విక్రయించాను. వడ్ల డబ్బులు చెల్లించినప్పటికీ, 500 రూపాయల చొప్పున బోనస్ రూపాయలు ఇప్పటివరకు చెల్లించలేదు. 18 వేల రూపాయలు బోనస్ రూపంలో రావాల్సి ఉంది. బోనస్ డబ్బులు ఇస్తే వానకాలం పంట సాగుకు మరికొంత సాయంగా ఉండేది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బోనస్ డబ్బులు చెల్లించాలి. 

- గుండ్ల ఎల్లయ్య, రైతు, చిన్న నాగారం, మహబూబాబాద్ ఎల్లయ్య,

ప్రభుత్వానికి నివేదించాం..

మహబూబాబాద్ జిల్లాలో సన్న రకం దాన్యం విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన బోనస్ బకాయిల కోసం ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశాల్లో బోనస్ బకాయి అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళాం. ప్రభుత్వం ప్రకటన కోసం నిరీక్షిస్తున్నాం. ప్రభుత్వం బకాయి డబ్బులు విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి చర్యలు తీసుకుంటాం. 

- ప్రేమ్ కుమార్, డి.ఎస్.ఓ , మహబూబాబాద్