23 August, 2026 | 7:52 PM

ధర్మ టీచర్స్ యూనిట్ విద్యా సదస్సు కరపత్రాల ఆవిష్కరణ

23-08-2026 07:10 PM

హనుమకొండ, ఆగస్టు 23 (విజయక్రాంతి): ధర్మ టీచర్స్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ నేల 26న  హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర  విద్యా సదస్సు కరపత్రాన్ని ఆదివారం హన్మకొండ నయీమ్ నగర్ లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మ టీచర్ యూనిట్ రాష్ట్ర కో కన్వీనర్ దామెర ఉపేందర్ మాట్లాడుతూ ఈ విద్యా సదస్సు ద్వారా దేశం, తెలంగాణ రాష్ట్రంలో సమస్త విద్యారంగం ఎదుర్కోబోతున్న సవాళ్లేమిటి,  విద్యా వ్యవస్థను ప్రభుత్వాలు ఏ స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నది, తద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంత నష్టం కలుగుతుంది, సమాజంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ఎంత ప్రభావం చూపబోతుంది మొదలైన అంశాలపై చర్చ ద్వారా మొత్తం సమాజానికి తెలియజేయడం జరుగుతుందన్నారు.

అభివృద్ధి చెందిన దేశాలు విద్యారంగానికి తమ బడ్జెట్లో అధిక స్థాయిలో కేటాయింపులు జరుపుతుంటే, మన ప్రభుత్వాలు విద్యారంగానికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల సమాజం అభివృద్ధి చెందాల్సిన అంత స్థాయిలో అభివృద్ధి జరగటం లేదని, బడ్జెట్లో చాలా తక్కువ స్థాయిలో బడ్జెట్ కేటాయింపుతో విద్యారంగాన్నే నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఇలాంటి విషయాలు ఈ విద్యా సదస్సులో చర్చకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సదస్సులో బీసీ, ఎస్సీ,ఎస్టీ వర్గాల మేధావులు, విద్యాభిమానులు అధిక సంఖ్యలో హాజరై విద్యా సదస్సును విజయవంతం చేయాలని కోరారు.