శిథిలమైన ట్రెజరీ కార్యాలయం అద్దె భవనంలో అధికారుల విధులు
బోథ్,ఆగస్టు23(విజయక్రాంతి): నియోజకవర్గ కేంద్రంలో ఐదు మండలాల ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేసే ట్రెజరీ కార్యాలయం శిథిలమైంది. దీంతో ఈ కార్యాలయంలో తాము విధులు నిర్వహించలేమని ఎప్పుడు కూలిపోతుందో తెలియదని ఆందోళన చెందడంతో కార్యాలయాన్ని దాదాపు రెండు సంవత్సరాల నుండి మార్కెట్ కమిటీ ఆవరణలోకి మార్చారు. దీంతో వివిధ పనులపై వచ్చి ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయం కోసం వెతకాల్సి వస్తున్నది. మరోవైపు కూలిపోయిన భవనం స్థానంలో మరో నూతనభవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. అద్దె భవనంలో ఇరుకు గదిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నూతన భవనం మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు.
అధికారుల దృష్టికి తీసుకువచ్చాం
నూతనంగా ట్రెజరీ కార్యాలయాన్ని నిర్మించాలని జిల్లా ఉన్నతాధికారు ల దృష్టికి తీసుకువచ్చామని ట్రెజరర్ విద్యాసాగర్ తెలిపారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ లో ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో ట్రెజరీ కార్యాలయాలు మంజూరయ్యాయి అన్నారు. స్థానిక నాయకులు ట్రెజరీ భవనం నిర్మాణం పై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు ఈ విషయంలో తగు చొరవ చూపించాల్సిన అవసరం ఉంది.






