23 August, 2026 | 8:24 PM

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉండగా మురుగు కాల్వ ఎందుకు?

23-08-2026 07:38 PM

ఇబ్బంది పడుతున్న 16వ వార్డు ప్రజలు

బీఆర్ఎస్ వార్డ్ ఇన్‌చార్జీ కరీం

కోదాడ ఆగస్టు 23, (విజయక్రాంతి): కోదాడ పట్టణం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరు కాగా 16వ వార్డులో మురుగు కాల్వ కోసం ఇళ్ళ ముందు ర్యాంపులు, మెట్లు ఎందుకు పగులగొట్టారని బీఆర్ఎస్ వార్డ్ ఇన్‌చార్జీ కరీం ప్రశ్నించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ 16వ వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం గత 10 రోజుల క్రితం ఇళ్ళ ముందు మెట్లు, ర్యాంపులు పగులగొట్టారని, నేటి వరకు పనులు పూర్తికాకపోవడంతో మహిళలు, చిన్నారులు ఇంటి నుండి బయటకు వెళ్ళాలంటే జంకుతున్నారని వాపోయారు.

కొంత మంది ఇళ్ళలోకి ద్విచక్ర వాహనాలు వెళ్ళే పరిస్తితి లేదన్నారు. పట్టణం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరైతే 16వ వార్డులో హడావుడిగా మురుగు కాల్వ నిర్మాణ పనులు చేపట్టడం ఎందుకు అని ప్రశ్నించారు. విలువైన ప్రజాధనం వృధా అవుతుందని, దీనిపై విచారణ చేయాలన్నారు. ప్రజల ఇబ్బందులు తొలగించే నిమిత్తం పనులు పూర్తిచేస్తే యధావిధిగా మెట్లు, ర్యాంపులు ఏర్పాటుచేసుకుంటారని అన్నారు.