23 August, 2026 | 8:06 PM

కొత్తగూడెం హెడ్ పోస్టాఫీసులో పాస్ పోర్ట్ సేవలు

23-08-2026 07:30 PM

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

కొత్తగూడెం ఆగస్టు 23 విజయక్రాంతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలోని హెడ్ పోస్టాఫీసులో,త్వరలోనే పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (పిఓపిఎస్కే) ఏర్పాటు కానుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెంలో పాస్‌పోర్ట్ కేంద్రం ఏర్పాటు చేయాలని, తాను కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి సమర్పించిన లేఖలు, సంప్రదింపులపై అధికారులు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి అనుమతితో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పీఎస్‌పీ డివిజన్ అండర్ సెక్రటరీకి పరిశీలన నిమిత్తం ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు.

కొత్తగూడెం ప్రధాన పారిశ్రామిక, గనుల, వాణిజ్య కేంద్రంగా విస్తరించి ఉందని, ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం పాస్‌పోర్ట్ సేవల కోసం 75 కిలోమీటర్ల దూరంలోని ఖమ్మం, మహబూబాబాద్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోందని గుర్తుచేశారు. దీనివల్ల వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, ప్రజలు సమయం, డబ్బు వృథా చేసుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం కొత్తగూడెం ప్రత్యేక జిల్లా కేంద్రంగా మారినందున ఇక్కడే పూర్తిస్థాయి కేంద్రం అవసరమని స్పష్టం చేశారు. ఈ సమస్యను కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి అనుమతులు సాధించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నామని తెలిపారు. త్వరలోనే కేంద్రం నుంచి అధికారిక ఆదేశాలు వెలువడి పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అందుబాటులోకి రానుందని కొనున్నాయి కూనంనేని తెలిపారు.