బజార్హత్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్‌పైరీ మాత్రల కలకలం
- అస్వస్థతకు గురైన గర్భిణి
- ఆగ్రహంతో ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబం నిరసన
ఇచ్చోడ , జూలై 10 (విజయక్రాంతి) : ప్రభుత్వ ఆసుపత్రులు పేద ప్రజలకు భరోసాగా నిలవాల్సిన చోట, నిర్లక్ష్యానికి నిలయాలుగా మారుతున్నాయా అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గర్భిణికి అందజేసిన ఫోలిక్ యాసిడ్ మాత్రలు గడువు ముగిసినవని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించడం స్థానికంగా కలకలం రేపింది.
ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రులలో మందుల నాణ్యత, నిల్వల నిర్వహణ, పర్యవేక్షణ వ్యవస్థలపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానికంగా నివసించే ఓ మహిళకు ఇటీవల గర్భం నిర్ధారణ కావడంతో వైద్య పరీక్షల నిమిత్తం బజార్హత్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించింది. సాధారణ పరీక్షల అనంతరం వైద్య సిబ్బంది ఆమెకు ఫోలిక్ యాసిడ్ మాత్రలను అందజేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే ఆ మాత్రలు తీసుకున్న కొద్దిసేపటికే గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురైందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వాంతులు, నీరసం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం అందజేసిన మందులను పరిశీలించగా, వాటిపై గడువు తేదీ ముగిసినట్లు గుర్తించినట్లు వారు పేర్కొన్నారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలతో కలిసి ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు.
‘గర్భిణుల ఆరోగ్యంతో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై ఎలా నమ్మకం ఉంచాలి?‘ అంటూ వారు ప్రశ్నించారు. మరోవైపు, తమపై వస్తున్న ఆరోపణలను ఆసుపత్రి సిబ్బంది తోసిపుచ్చినట్లు సమాచారం. మందుల పంపిణీలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని, పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు పేర్కొన్నట్లు తెలిసింది.






