డబ్బులు తీసుకున్నది వాస్తవమే..
ఏటీడీఓ భాస్కర్
విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం..
ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం..
మెమో అందజేశాం..
బెజ్జూర్ జూన్ 30 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని గిరిజన బాలికల ‘ఆశ్రమ పాఠశాలలో లేటు ఫీజు వసూళ్ల కలకలం‘ అనే కథను విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు.
విద్యార్థినిలు ఆలస్యంగా వచ్చారని వారి వద్ద నుండి వార్డెన్ శ్రీనివాస్ డబ్బులు వసూలు చేయడం విషయమై దినపత్రికలో వచ్చిన కథనానికి ఏటీడీవో భాస్కర్ మంగళవారం గిరిజన ఆశ్రమ పాఠశాలలో వార్డెన్ శ్రీనివాస్ విద్యార్థుల వద్ద డబ్బులు వసూలు చేసిన విషయంపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థినిల వద్ద నుండి డబ్బులు తీసుకున్నది వాస్తవమేనని, తీసుకున్న డబ్బులను మళ్లీ తిరిగి విద్యార్థినిలకు అందించినట్లు తెలిపారు. విద్యార్థినిల వద్ద వార్డెన్ డబ్బులు వసూలు చేయడం నేరమేనని ఒప్పుకున్నట్లు తెలిపారు.
విచారణ చేపట్టాం..
విద్యార్థినిల వద్ద డబ్బులు వసూలు చేసిన విషయమై విద్యార్థినీలను, ప్రధానోపాధ్యాయురాలను, ఉపాధ్యాయులను విచారణ చేపట్టగా డబ్బులు తీసుకున్న విషయం వాస్తవమేనని వారు తెలిపారు. వార్డెన్ చేసిన పనితీరుపై మెమో జారీ చేసినట్లు ఏటీడీవో భాస్కర్ తెలిపారు. ఇట్టి నివేదికను ఐటిడిఏ పిఓకు అందచేస్తామని తెలిపారు. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఇలానే విద్యార్థినిల వద్ద పాఠశాలకు ఆలస్యం వచ్చారని వేల రూపాయలు వసూలు చేశారని విద్యార్థినిల తల్లిదండ్రులు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ముందుగా మధ్యాహ్న భోజనం పరిశీలించి నీళ్ల చారుల పప్పు చేయడం ఏంటని వార్డెన్ ను ప్రశ్నించారు. విద్యార్థినిలకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతతో మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు.
పాఠశాల ప్రాంగణంలోని త్రాగునీరు ప్రదేశంలో అపరిశుభ్రత, పైప్ లైన్ లీకేజ్, నిలిచిన మురికి నీరు, దుర్వాసన రావడంతో ఈగలు దోమలతో విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్నామని తెలుపుతున్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థినిల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రధాన ఉపాధ్యాయురాలు మారుబాయికి, వార్డెన్ శ్రీనివాస్ కు సూచించారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇట్టి విషయమై డిడి ప్రేమకళ ను వివరణ కోరగా బెజ్జూర్ హాస్టల్లో విద్యార్థినిల వద్ద డబ్బులు తీసుకున్న విషయమై దినపత్రికలు వచ్చిన కథనాన్ని పరిశీలించినట్లు తెలిపారు. విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వారన్నారు. విద్యార్థినిలకు ప్రభుత్వం నుండి అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని వారి వద్ద నుండి ఇలాంటి డబ్బులు తీసుకోవడం సరికాదని వారికి అన్ని రకాల వసతులు కల్పించాలని విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె అన్నారు.






