27 July, 2026 | 2:50 AM

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

27-07-2026 02:12 AM

నారాయణఖేడ్, జూలై 26: నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో ఆషాఢ మాసం సందర్భంగా బోనాల వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శాస్త్రి నగర్ కాలనీలో వెలసిన గడి మైసమ్మ , దత్తాత్రేయ కాలనీలోని కట్ట మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి దర్శించుకుని, కాలనీవాసులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూఆషాఢ మాస బోనాల పండుగ మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు.

భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించడం వల్ల నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి రైతన్నలు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, రుక్మిణి గోపాల్ రెడ్డి, సుబుర్, మహేష్ చౌహన్, విజయ్ బుజ్జి, మున్సిపల్ కౌన్సిలర్లు, ముంతాజ్ సెట్, మున్సిపల్ కోఅప్షన్ సభ్యులు, పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ, శాతం దత్తు, మారుతి రావు, శంకర్ ముదిరాజ్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.