పల్లెగడ్డ తండాలో క్షుద్రపూజల కలకలం
భయాందోళనలో పల్లె గడ్డ తండావాసులు
తాడ్వాయి, ఆగష్టు, 9 (విజయక్రాంతి): అక్కడ ఒకప్పుడు పాత బురుజు ఉండేది. గత 80 -100 సంవత్సరాల క్రితం ఒక ఊరు ఉండేదని తండావాసులు తెలిపారు. ఆ ప్రాంతం వైపుకు వెళ్లాలంటే ప్రజలు భయపడే వారన్నారు. అక్కడికి పగటిపూట వెళ్లడానికి సైతం భయపడతారని తెలిపారు. అలాంటి ప్రదేశంలో రాత్రివేళ క్షుద్ర పూజలు చేయడం కలకలం రేపుతుంది.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పరిధిలోని పల్లె గడ్డ తండాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పల్లెగడ్డ తండా బురుజు సమీపంలో బంగారం నిధుల కోసమే క్షుద్ర పూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డికి చెందిన ఓ మహిళ శనివారం సాయంత్రం యువకులతో కలిసి తండాకు వచ్చినట్లు వారు తెలిపారు.ఆమె యువకులుతో కలిసి ఇక్కడ క్షుద్ర పూజలు చేయించినట్లు తండవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.సదరు మహిళా బంగారం కోసమే పూజలు చేసిందా లేదా గత కొన్ని నెలల నుంచి ఆ ప్రాంతంలో భూ వివాదం పై గొడవలు సాగుతున్నాయి. ఆ ప్రాంతానికి ఎవరూ రావద్దనే కోణంలో పూజలు చేయించి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆమె రాత్రి సమయంలో అక్కడే ఉండి కుంకుమ పసుపు నిమ్మకాయలతో పూజలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బురుజులో నిధులు ఉంటాయని వాటి కోసమే పూజలు చేయించి తవ్వకాలు జరిపారని వారు గట్టిగా చెబుతున్నారు. ఈ విషయమై సదురు మహిళల, గుర్తు తెలియని వ్యక్తులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని వివరించారు. తండాలో అర్ధరాత్రి సమయంలో ఇలాంటి క్షుద్ర పూజలు చేయడంతో తండా వాసులు భయాందోళనకు గురవుతున్నారు.కచ్చితంగా పోలీసులు అనుమానిత క్షుద్ర పూజలు చేసిన వ్యక్తులను గుర్తించి వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.






