15-11-2025 12:56:41 AM
-గంజాయి బానిసలకు విక్రయించిన కల్లు వ్యాపారులు
-అల్పాజోలం విక్రయిస్తూ నలుగురు అరెస్ట్
నాగర్ కర్నూల్ నవంబర్ 14 ( విజయక్రాంతి): గంజాయి మత్తుకు బానిసగా మారిన ఇద్దరు యువకులు గంజాయి అందుబాటులో లేదనే కారణంతో కల్తీ కల్లులో వినియోగించే అల్పాజోలం కల్లు వ్యాపారుల నుండి కొనుగోలు చేసి కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగుతూ పోలీసులకు చిక్కారు. వారి నుండి 26.22 గ్రాముల అల్పాజోలం, 2 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
బిజినపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన వంగ ఆంజనేయులు గౌడ్, లింగసానిపల్లి గ్రామానికి చెందిన గార్లపాటి పురుషోత్తం గౌడ్ ఇరువురూ అక్రమంగా కల్తీకల్లు వ్యాపారం చేస్తున్నారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే నిషేధిత ఆల్ఫాజూలం మత్తు మందును వనపర్తి జిల్లా ప్రాంతానికి చెందిన నర్సం గౌడ్ వద్ద విక్రయించాడు.
కొన్ని రోజులుగా గంజాయి క్రయ విక్రయాలు నిలిచిపోవడంతో గంజాయి మత్తుకు బానిసగా మారిన ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన మైల శివశంకర్, తిర్మలాపూర్ గ్రామానికి చెందిన గులోల్లు సాయిరాం అనే ఇద్దరు యువకులకు నిషేధిత ఆల్ఫాజోలం విక్రయించాడు. ఉయ్యాలవాడ గ్రామ శివారులోని గోల్డెన్ కేఫ్ దాబా సమీపంలో నిషేధిత ఆల్ఫాజోలం క్రయ విక్రయాలు జరుపుతున్నట్లు ఖచ్చితమైన సమాచారం మేరకు నాగర్ కర్నూల్ ఎస్త్స్ర గోవర్ధన్ తన సిబ్బంది ఆకస్మికంగా దాడి చేసే నలుగురిని పట్టుకున్నట్లు డిఎస్పి తెలిపారు. సమావేశంలో సిఐ అశోక్ రెడ్డి, ఎస్త్స్ర గోవర్ధన్, కానిస్టేబుల్స్ భీముడు, రమేష్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.