calender_icon.png 18 August, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీఏ నిధుల వినియోగం అవినీతిమయం

18-08-2025 02:21:45 AM

  1. జిల్లాల్లో మౌలిక వసతులు కల్పించలేదు
  2. టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిధుల వినియోగంలో అవినీతి జరిగిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. ఇదంతా కాగ్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందన్నారు. ఆదివారం ఖమ్మంలో మీడియా సమావేశంలో గురువారెడ్డి మాట్లాడారు. సంస్థలోని ఖర్చు వివరా లు వారి స్వంత ఆడిటర్ల ద్వారా కూడా ఆమోదం పొందలేదని, అయినప్పటికీ హెచ్‌సీఏ జనరల్ బాడీ 2022 2023 ఆర్థిక సంవత్సరాల ఖాతాలను అక్రమంగా ఆమోదించిందన్నారు.

గతంలో ఉన్న కార్యదర్శులు, వెండర్లు పెద్దఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు, 2023 అక్టోబర్‌లో నాలుగు ఎఫ్‌ఐఆర్‌లలో కేసులు నమో దైనప్పటికీ, వారిపై హెచ్‌సీఏ ఎలాంటి చర్య లు తీసుకోలేదని విమర్శించారు. జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు కమిటీ సూచించిన సంస్కరణలను హెచ్‌సీఏ పూర్తిగా విస్మరించిందని, నేరాలతో సంబంధం ఉన్న వారు ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లు విలువైన ప్రజా ధనాన్ని ఏవిధంగా దుర్వినియోగం చేశారో వివరించారు. 

అనర్హులకు ఓటు హక్కు

జట్లు పెట్టని క్లబ్స్, బీసీసీఐ నియమావళిని పాటించని సంస్థలు, సభ్యత్వానికి అనర్హులైనా వాటికి ఓటు హక్కు కల్పించారని వెల్లడించారు. గత పదేళ్లుగా జిల్లాల్లోని కొన్ని క్లబ్‌లు విభిన్న అభివృద్ధి పనుల పేరుతో తప్పుడు లెక్కలు చూపుతూ నిధులు తీసుకున్నారని తెలిపారు. హెచ్‌సీఏ ద్వారా రూ.200 కోట్లకు పైగా దోచుకుపోయారని, అందులో రూ.12 కోట్ల వరకు జిల్లాల క్రికెట్ పేరిట దుర్వినియోగం చేశారని స్పష్టం చేశారు.

ఈ అవినీతిలో ప్రమేయం ఉన్న వ్యక్తులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి అరెస్టులు చేయాలని కోరారు. హెచ్‌సీఏకు 90 ఏళ్ల చరిత్ర ఉన్నా తెలంగాణలో ఎక్కడా సరైన క్రికెట్ మౌలిక వసతులు, అభివృద్ధి చేయలేదన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు  హెచ్‌సీఏ అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో టీసీఏ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ డా. ప్రదీప్ కురాపాటి, సెక్రటరీ వీరేశ్‌గౌడ్, వరంగల్ జోన్ సెక్రటరీ జయపాల్, చిత్తరంజన్ తదితరులు పాల్గొన్నారు.