స్నేహపూర్వకంగా క్రీడలను ఆడుకోవాలి
ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కుట్టే
ఉట్నూర్,(విజయక్రాంతి): యువతను చెడు అలవాట్ల నుండి దూరం చేసేందుకు పోలీస్ శాఖ ఎంతో కృషి చేస్తుందని, అందులో భాగంగానే పోలీస్ శాఖ ద్వారా యువతకు ఆటల పోటీలు నిర్వహిస్తుందని ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కుట్టే అన్నారు. బుధవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని నాగోబా విద్యా నిలయంలో మారుమూల గిరిజన గ్రామాల యువతకు ఏర్పాటుచేసిన వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు మార్గాన్ని వీడి సన్మార్గంలో నడుచుకోవాలని, ఆటల పోటీలను స్నేహపూర్వకంగా ఆడుకోవాలని సూచనలు చేశారు.
మారుమూల గిరిజన గ్రామాల యువత ఉన్నత లక్ష్యం ను నిర్ణయించుకొని ఉన్నత విద్య వైపు పయనించాలని యువతకు సూచనలు చేశారు. మారుమూల గ్రామాల్లో చదువులు మధ్యలో నిలిపివేసిన యువకులు తిరిగి చదువుకునేందుకు అవకాశం ఉందని అన్నారు. చదువుకోవాలని పట్టుదల ఉన్న యువకులు పోలీస్ శాఖను సంప్రదిస్తే వారికి దూర విద్యను అందించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని ఈ సందర్భంగా యువతకు సూచనలు చేశారు. ఆయనతోపాటు ఉట్నూర్ సీఐ మాడవి ప్రసాద్, ఎస్సై సాయన్న, స్థానిక సర్పంచ్ రాథోడ్ మోహన్ సింగ్, మాజీ ఎంపీపీ తుకారాం, మండలంలోని 15 గ్రామాల వాలీబాల్ క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు.






