24 July, 2026 | 2:50 AM

వైభవ్ విధ్వంసం

24-07-2026 01:44 AM

జింబాబ్వే పర్యటనలో భారత్ శుభారంభం చేసింది. హరారే వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలింగ్‌లో  ప్రిన్స్ యాదవ్ , మయాంక్ యాదవ్ మెరిస్తే, బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. దీంతో జింబాబ్వే చిత్తుగా ఓడిపోయింది.

  1. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
  2. తొలి టీ20లో జింబాబ్వే చిత్తు
  3. మెరిసిన మయాంక్, ప్రిన్స్ యాదవ్
  4. సిరీస్‌లో 1 ఆధిక్యం

హరారే, జూలై 23 : ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. యువ పేసర్ అశోక్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. భారత పేసర్లు తొలి ఓవర్ నుంచే జింబాబ్వే బ్యాటర్లను బెంబేలెత్తించారు. తొలి బంతికే  మయాంక్ యాదవ్ అద్భుతమైన బంతితో బెన్నెట్‌ను పెవిలియన్ కు పం పించాడు. ఇక్కడ నుంచి జింబాబ్వే వరుస వికెట్లు కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్, శివ మ్ దూబే కూడా చెలరేగడంతో జింబాబ్వే కీలక బ్యాటర్లు సికిందర్ రజా(4), డియోన్ మెర్స్(6) , బెన్ కర్రాన్(10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ర్యాన్ బర్ల్ (26) రవి బిష్ణోయ్ ఔట్ చేశాడు. దీంతో జింబాబ్వే 64 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో వెస్లె మెధెవెరె ఆదుకున్నాడు.  ఆల్ రౌండర్ 34 బంతుల్లో 39 పరుగులు చేయగా, వికెట్ కీపర్ మరుమణి (27) కూడా రాణించడంతో జింబాబ్వే స్కోరు 100 దాటగలిగింది. చివర్లో వరుస వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 2, ప్రిన్స్ యాదవ్ 2 , రవి బిష్ణోయ్ 1, దూబే 1 వికెట్ పడగొట్టారు. తర్వాత స్వల్ప లక్ష్యఛేదనలో భారత్ దూకుడుగా ఆడింది. అభిషేక్ శర్మ(1) నిరాశపరిచినా, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు.

జింబాబ్వే బౌలర్లపై తన సహజశైలిలో విరుచుకుపడ్డాడు. ఇంగ్లాండ్ టూర్‌లో విఫలమైన ఈ చిచ్చర పిడుగు కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో హాఫ్ సెంచరీ బాదిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. వైభవ్ కేవలం 15 ఏళ్ల 118 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించాడు. రిచర్ట్ నగవర బౌలింగ్‌లో మొదటి బంతికి పరుగులేమీ చేయని వైభవ్ రెండు, మూడు, నాలుగు బంతుల్లో వరుసగా 6,4,6 బాదాడు.

రెండో ఓవర్లో మొత్తంగా 20 పరుగులు రాబట్టాడు. నాలుగు నెలల క్రితం ఇదే వేదిక మీద.. అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ మీద వైభవ్ 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి భారత్‌కు టైటిల్ అందించాడు. జింబాబ్వేకు తొలి టీ20కి ముందు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తనకు హరారే ఆడిన అనుభవం, పిచ్ గురించి పూర్తి అవగాహన ఉందన్నాడు. అన్నట్లుగానే విధ్వంసకర హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 

వైభవ్ సూర్యవంశీ 19 బంతుల్లో 50(4 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులకు ఔటవగా, తర్వాత ఇషాన్ కిషన్ (35), శ్రేయాస్ (28 నాటౌట్), తిలక్ వర్మ (6 నాటౌట్ ) జట్టు విజయాన్ని పూర్తి చేశారు. దీంతో భారత్ 13.2 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ లో తర్వాతి మ్యాచ్ శనివారం ఇదే వేదికలో జరుగుతుంది.

స్కోరు బోర్డు 

జింబాబ్వే ఇన్నింగ్స్ : 125/7 ( మెదెవెరె 39, ర్యాన్ బర్ల్ 26, మరుమణి 27, మయాంక్ యాదవ్ 2/18, ప్రిన్స్ యాదవ్ 2/19, బిష్ణోయ్ 1/24 , దూబే 1/32)

భారత్ ఇన్నింగ్స్ : 126/3(13.2 ఓవర్లు)( వైభవ్ సూర్యవంశీ 50, ఇషాన్ కిషన్ 35, శ్రేయాస్ అయ్యర్ 28 నాటౌట్, ముజరబానీ 2/26, నగరవ 1/30)